ఆద్యంతం మోదీ..

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. కేరళ, తమిళనాడులకు వరాల జల్లు

Feb 27, 2024 - 19:37
 0
ఆద్యంతం మోదీ..

కేరళ, చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 27, 28 తేదీల్లో కేరళ, తమిళనాడు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం (27)న కేరళలోని కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ని సందర్శించి బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. ఆయా సభల్లో, ర్యాలీల్లో ఆద్యంతం మోదీ అనేలా కార్యక్రమాలు కొనసాగడం విశేషం.

వ్యోమగాములకు అభినందన..
స్పేస్​ సెంటర్​ లో మూడు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇస్రో ప్రొపల్షన్​ కాంప్లెక్స్​ లో సెమీ క్రయోజెనిక్స్​ ఇంటిగ్రేటెడ్​ ఇంజన్​, స్టేజ్​ టెస్ట్​, ట్రిసోనిక్ విండ్ టన్నెల్’లను ప్రారంభించారు. ఈ మూడు ప్రాజెక్టుల వ్యయం రూ. 1800 కోట్లు. గగన్​ యాన్​ మిషన్​ పురోగతిపై ప్రధాని మోదీ సమీక్షించారు. వ్యోమగాములను భుజం తట్టి అభినందించారు. భారతదేశ కీర్తి పతాకాలను ఇనుమడింప చేయాలని ప్రధాని వ్యోమగాములను కోరారు.  

అన్నామలైకు అభినందన..
అనంతరం సాయంత్రం తమిళనాడు తిరుప్పూర్​ లో ఆ రాష్ర్ట బీజేపీ నేత అన్నామలై వందరోజులపాటు కొనసాగించిన యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తూ అన్నామలైను అభినందించారు. తూత్తుకుడిలో రూ 17,300 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించారు. మధురైలో 'క్రియేటింగ్ ది ఫ్యూచర్-డిజిటల్ మొబిలిటీ ఫర్ ఆటోమోటివ్ (ఎంఎస్​ఎంఈ) ఎంటర్‌ప్రెన్యూర్స్'లో ప్రధాని పాల్గొన్నారు. బుధవారం ప్రధాని మహారాష్ర్టలో పర్యటించనున్నారు. 

ప్రధాని ప్రసంగం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గగన్‌యాన్ మిషన్‌లో ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను  ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్​ పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్​, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని వీరినుద్దేశించి మాట్లాడుతూ.. వీరు అంతరిక్షంలోకి వెళ్లే వ్యక్తులు మాత్రమే కాదని శక్తులని  కొనియాడారు. 21వ శతాబ్ధంలో భారత్​ ప్రపంచస్థాయి దేశంగా అవతరించేందుకు ఎంతో దూరంలో లేదన్నారు. కీలక ప్రాజెక్టుల్లో నారీశక్తి పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టుల కళ సాకారం అయ్యేది కాదన్నారు. ఈ మిషన్​ లో భారత్​ లోనే పరికరాల తయారీ అభినందనీయమన్నారు. 140 కోట్లమంది ఆకాంక్షలను నిజం చేసే రోజు అతి దగ్గరలోనే ఉందని ప్రధాని పేర్కొన్నారు.  భారత్​ 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉంటుందని అంతరిక్షంలో అధ్యయనాలకు ఇది దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గగన్​ యాన్​ మిషన్​ లో పాల్గొననున్న ఈ నలుగురు మూడు రోజులపాటు అక్కడే ఉండి పలు వివరాలతో భూమికి తిరిగి రానున్నారు.

విమర్శలు..
ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో విపక్షాల చర్యలను ఎండగట్టారు. ప్రతిపక్ష కూటమిపై విమర్శల బాణాలను సంధించారు. విపక్షాలు బీజేపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వజాలకే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 75 ఏళ్లు పాలించి ఏం అభివృద్ధి సాధించారని నిలదీశారు. ఢిల్లీలో ఎయిర్​ కండీషన్​ గదుల్లో కూర్చొని దేశాన్ని ముక్కలు చేసే రాజకీయాలు చేస్తారా? అని దుయ్యబట్టారు. తమిళనాడును దశాబ్ధాలుగా దోచుకున్న వారు కూడా బీజేపీని చూసి భయపడుతున్నారని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు రేపి అధికారాన్ని కాపాడుకోవాలనుకోవడం అంత మూర్ఖత్వం మరోటీ లేదన్నారు. ఏంజీఆర్​, జయలలిత తమిళనాడు ప్రజల కోసం చేసిన సేవలను కొనియాడారు. ప్రస్తుత పార్టీలు ఈ ఇరువురిని ఘోరంగా అవమానించడం తగదన్నారు. వారు నిరంతరం ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమిళ ప్రజలు విలక్షణ తీర్పునిస్తూ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. తమిళభాషపై తనకు మక్కువ ఎక్కువని, ఐక్యరాజ్యసమితిలో కూడా తనను తమిళ కవిత్వం గురించి అడుగుతుంటారని, ‘కాశీ తమిళ సంగమం’ నిర్వహించిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. సాక్షాత్తూ పార్లమెంట్​ లోనే సెంగోల్​ ను ప్రతిష్ఠించి మనదేశ కీర్తి ప్రతిష్ఠతలను మరింత పెంచే ప్రయత్నాన్ని చేశామన్నారు. డీఎంకే, కాంగ్రెస్​ లు మిత్ర పక్షాలను ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ రెండు పార్టీలు తమిళ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు.

భుజం తట్టి..
సభలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై భుజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు తడుతూ అభినందించారు. ఈ విషయాన్ని పదేపదే మీడియాలో చూపడంతో బహు జనాదరణ లభించడం విశేషం. తమిళనాడులో అన్నామలై పార్టీ అభివృద్ధికి చేసిన కృషి సందర్భంగా ప్రధాని భుజం తట్టారు.