నా తెలంగాణ, రామకృష్ణాపూర్ : వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ చెట్లు నరికేస్తున్నారు. వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. ఇటీవల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి స్థలంలో పుర అధికారుల నిర్లక్ష్యమో, పుర అధికారులు స్థలాన్ని ఆక్రమించే దురుద్దేశ్యమో గాని ఇష్టారీతిగా చెట్లును నరకి పర్యావరణానికి నష్టం కల్గించారు. ఫలితంగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతూ ప్రకృతి విలయానికి కారకులుగా మారారు. ప్రజా ప్రతినిధులను పుర అధికారులు కాపాడేందుకే ఫారెస్ట్ అధికారులు తూతూ మంత్రంగా నరికివేతకు గురైన చెట్లను పరిశీలించి నామ మాత్రపు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
నిబంధనల ప్రకారం ఒక చెట్టును నరకాలంటే ముందుగా సంబంధిత సింగరేణి ఎస్టేట్, మండలాల తహసీల్దార్ల, ఫారెస్ట్ అధికారుల నుంచి ఖచ్చింతంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా చెట్లను నరికి వేయడం వల్ల వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతోందని పలువురు వాపోతున్నారు.
చెట్లను నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం- పుర కమిషనర్
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ 22వ వార్డు ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా ను అనుకొని ఉండే ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల తొలగింపుపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ను వివరణ కోరగా చెట్లను నరికిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, పుర అధికారులు ముందుడి నిర్వహిస్తున్నామని తాము చేసే పనులలో రాజకీయ నాయకులు, బయట వ్యక్తులు కలగజేసుకోవద్దని కోరారు.
వాల్టా చట్టాన్ని ఉల్లంఘన చేస్తే చర్యలు తప్పవు- తహసిల్దార్
వాల్టా చట్టాన్ని ఉల్లంఘన చేస్తే చర్యలు తప్పని మందమర్రి తహసిల్దార్ సతీష్ పేర్కొన్నారు. ప్రాంత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.