గిరిజనులకు పోడుపట్టాలివ్వాలి
కవ్వాల్ జోన్ లో భారీ వాహనాలను అనుమతించాలి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే వెడ్మ విజ్ఞప్తి
నా తెలంగాణ, ఉట్నూర్: అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో సమస్యలను మంత్రికి వివరించారు. గిరిజనుల పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, అనేక మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు అందలేదని వివరించారు.
గిరిజనేతర రైతులు కూడా అటవీ భూముల్లో సాగులో ఉన్నారని వారికీ కూడా పోడు పట్టాలు ఇచ్చే విషయంలో సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని కోరారు.
కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారని దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భారీ వాహనాలను అనుమంతిచక పోవడంతో సరుకులు తరలింపులో వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజా అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు, ఉట్నూర్ నుంచి మంచిర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కోరారు.
అటవీ ప్రాంతంలో ఉన్న మిద్దె చింత, ధర్మాజీ పేట్, రాగి దుబ్బ గ్రామాలలో విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నాయని, ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకొంటున్నారని, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందే విధంగా అటవీ శాఖ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
గిరివికాసం పథకం కింద గిరిజన రైతులకు వ్యవసాయ బావులు అందించామన్నారు. బావుల్లో పుష్కలంగా నీరు ఉన్నా త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వెంటనే త్రీ ఫేస్ విద్యుత్ అందించేలా అధికారులను ఆదేశించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్ లు, అటవీ శాఖ ఉన్నతధికారులు పాల్గొన్నారు.