సుందరీకరణ పేరుతో మూసీ పరివాహాక ప్రాంత వాసులపై జులుం
కంపు అని నీతో చెప్పారా?
బస్సు డిపో, మెట్రో స్టేషన్ లను ఏం చేస్తారు?
రిటైనింగ్ వాల్ కట్టాకే సుందరీకరణ చేపట్టాలి
లేకుంటే పిడికిలి బిగించి పోరాటం తప్పదు
నా తెలంగాణ, హైదరాబాద్: రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలపై మూసీ సుందరీకరణ పేరుతో వారి కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారి ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డిలు పేదల పక్షపాతి అని చెప్పుకుంటూనే వారిపై జులుం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటుక ఇటుక పేర్చుకొని కట్టుకున్న ఇళ్లను కంపు పేరుతో తరలించాలనే కుటీల యత్నానికి తెరలేపారని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. మూసీ పరివాహాక చరిత్ర తెలుసా అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఏనాడైనా ఆ ప్రాంత వాసులు అక్కడ కంపు, వాసన అని నీతో చెప్పారా? అని నిగ్గదీశారు. బస్టాండ్, మెట్రో స్టేషన్ లు మూసీలోనే కట్టారని వాటిని ఏం చేస్తారని? నిలదీశారు. తాము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదన్నారు. కానీ ముందుగా నిరుపేదలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి మూసీ ప్రాంతంలో ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టి వారి ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేపట్టాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పిడికిలి బిగించి బీజేపీ నిరుపేదలు, బాధితుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉందని మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శుక్రవారం ఇందిరాపార్కు (ధర్నాచౌక్) వద్ద మూసీ బాధితులకు అండగా, హస్తం పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల ఇళ్ల జోలికి వస్తే ఉరుకోబోమన్నారు. జేపీ నడ్డా, మోదీల నేతృత్వంలో పేదలకు అన్యాయం జరగనీయమని స్పష్టం చేశారు. మూసీ పరివాహాక పేద ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని బీజేపీ పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కిషన్ రెడ్డి భరోసా కల్పించారు.
వారి బాధలు వర్ణణాతీతం..
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి కావస్తుందన్నారు. ఈ సమయంలో ఏ ఒక్క ఇంటికి పునాదిరాయి వేయలేదన్నారు. బీజేపీ నాయకులు మూసీ ప్రాంత పర్యటనలో వారి ఈతిబాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఆ నిరుపేదలందరూ ఎక్కడ తమ ఇళ్లు కూలగొడతారో అని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కడుపు నిండా కూడా తినలేని పరిస్థితుల్లో వారున్నారని చెప్పారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను హస్తం పార్టీ అన్యాయంగా సుందరీకరణ పేరు చెప్పి కూల్చివేస్తుంటే ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో తమకు గోడు వెళ్లబోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో వారందరికీ అండగా ఉండాలని మోదీ నేతృత్వంలో నిర్ణయించామన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరిగితే బీజేపీ ఉరుకోబోదని హెచ్చరించారు.
హామీలేమయ్యాయి..
ఇళ్లు కట్టిస్తాం, మహిళలకు రూ. 2500, రైతులకు రుణమాఫి, రైతు కూలీలకు 12వేలు, పెన్షన్ లు పెంచుతాం, నిరుద్యోగులకు భృతి, రైతులకు సబ్సిడీ లాంటి అనేక రకాల హామీలను ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఆరుగ్యారంటీల పేరుతో సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిలు ప్రజలను మభ్యపెట్టి గ్యారంటీలను గారడీలుగా మార్చి అధికారంలోకి వచ్చాక మసిబూసి మారెడుకాయ చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్న, తెలంగాణ ఉద్యమంలో 1500మంది బలిదానాలకు కారణమైంది కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. వీరి పాలన ఏ విధంగా ఉందో ఇప్పటికైనా ప్రజలు గమనించాలన్నారు.
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసీ ప్రజలను భయపెట్టిందన్నారు. అప్పుడు కూడా బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల ఇళ్లను రక్షించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు. స్థానిక ఎంపీలు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారని అన్నారు. మూసీ పరివాహాక ప్రాంతంలోని బాధితులందరినీ స్వయంగా కలిసి వారి ఆవేదన, ఆక్రోశం, కష్టాలు, కన్నీళ్లను అత్యంత దగ్గరి నుంచి చూశామన్నారు. అందుకే ఆ నిరుపేదలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నామన్నారు.
సుందరీకరణకు వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు వ్యతిరేకం కాదన్నారు. కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే బీజేపీ అడ్డుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి సుందరీకరణ చేపట్టాలన్నారు. పేద ప్రజలు ఆ వాసనలోనే ఉండాలని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాల నుంచి ఉన్న ఇళ్లను ఏ రకంగా కూలుస్తారని ప్రశ్నించారు. మూసీ పారివాహక ప్రాంతం చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా? అని నిగ్గదీశారు.
ప్రక్షాళన చేపట్టకుండా సుందరీకరణ..
మూసీలో అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజీ నీరు కలుస్తుందన్నారు. కుత్బుల్లాపూర్, బాలానగర్, మల్కాజ్ గిరి ఇలా అనేక ప్రాంతాల నుంచి మూసీలో నీరు కలుస్తుందన్నారు. దాన్ని డైవర్ట్ చేయకుండా ఎస్టీపీలు నిర్మాణం చేయకుండా మూసీ ప్రక్షాళన ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. చేయలేరన్నారు. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి ఆ తరువాత మూసీ సుందరీకరణ చేపట్టాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కార్మికులకు జీతాలివ్వరా?..
జీహెచ్ ఎంసీకి రూపాయి రాల్చే దిక్కు దివానం లేదని, డ్రైనేజీ వ్యవస్థ, విధీ లైట్లు సరిచేసే దిక్కులేదని మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కనీసం కాలిపోయిన బల్బులను కూడా మార్చేందుకు ప్రభుత్వం వద్ద నయాపైసా లేదన్నారు. కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.
బస్సు డీపో, మెట్రో స్టేషన్లను ఏం చేస్తారు?..
మూసీ ప్రాంతంలో బస్సు డిపో, మెట్రో స్టేషన్ లను ఏం చేస్తారని, అసలు ఏ విధంగా మూసీలో నిర్మాణం చేపట్టారని నిలదీశారు. పెద్ద పెద్ద వ్యాపారులు రియల్ ఎస్టేట్ విల్లాలు కడుతున్నారని, ఫాంహౌస్ లు కట్టుకుంటే వాటి గురించే మాట్లాడరని విమర్శించారు. రెక్కాడితేగానీ డొక్కాడని మూసీ ప్రాంత వాసుల మీద కాంగ్రెస్ ప్రతాపం ఏంటని నిలదీశారు.
మరోమారు సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డిలకు మనవి చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ లో పేదలు ఏ రకంగా వీరి ఆధ్వర్యంలో ఇబ్బందులకు గురవుతున్నారో? చూడాలన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, ఎంపీ బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాజేశ్వర్ రెడ్డి, కామారెడ్డి శాసనసభ్యులు కోటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే హరీష్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన వారికి, మూసీబాధితులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.