ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి ఒకరి మృతి
ఐదుగురికి తీవ్ర గాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని గుల్ మార్గ్ లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు, ఆర్మీలో పోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఒకరు మృతి చెందారు. గుల్‌మార్గ్‌లోని నాగిన్ ప్రాంతంలో 18 రాష్ట్రీయ రైఫిల్స్ (ఆర్‌ఆర్) వాహనంపై ఈ ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోట్‌పత్రి నుంచి ఆర్మీ వాహనం వస్తుండగా ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా అధికారులు తెలిపారు. వెంటనే విషయం తెలుసుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి అదనపు బలగాలను రప్పించారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు.