లండన్ భారత్ హై కమిషన్ పై దాడి కేసులో పురోగతి
దిబ్రూగఢ్ జైలు నుంచి ఖలిస్థానీ నాయకుడు ఇందర్ పాల్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ దాడిలో పాక్ హస్తంపై విచారణ
న్యూఢిల్లీ: లండన్ లో భారత్ హైకమిషన్ పై దాడి కేసులో ఎన్ ఐఏ పురోగతి సాధించింది. ఈ కేసులో పాక్ హస్తం కూడా దాగి ఉందని గుర్తించింది. గురువారం ప్రధాన నిందితుడిని ఎన్ఐఏ దిబ్రూగఢ్ జైలు నుంచి అదుపులోకి తీసుకుంది. విచారణలో విస్తుగొలిపే విషయాలను కనుగొన్నట్లు శుక్రవారం ఎన్ ఐఏ మీడియాకు వివరించింది. భారత్ హై కమిషన్ పై దాడి చేసిన ఇందర్ పాల్ సింగ్ యూకేలోని హౌన్స్ కు చెందినవాడని పేర్కొంది. గతేడాది మార్చి 19, 22వ తేదీల్లో జరిగిన దాడిలో ఇతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దాడి అనంతరం భారత ప్రభుత్వం, లండన్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టింది.
ఈ దాడిపై బ్రిటిష్ పార్లమెంట్ లోనూ భారత్ ఒత్తిడి మేరకు చర్యలకు డిమాండ్ చేసింది. దీంతో నిందితుల గుర్తింపునకు బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు పూర్తి సహకరిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్ ఐఏ పంజాబ్, రాజస్థాన్ లలో 31 చోట్ల సోదాలు నిర్వహించి పలువురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు ఇందర్ పాల్ సింగ్ గౌబాపై ఎల్ వోసీ జారీ చేసినట్లు ఎన్ ఐఏ గుర్తించింది. ఇందర్ పాల్ సింగ్ గౌబా గత ఏడాది డిసెంబర్ 9న పాకిస్థాన్ నుంచి భారత్ లోకి ప్రవేశిస్తుండగా అట్టారీ సరిహద్దు వద్ద గౌబాను సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ ఇందర్ పాల్ సింగ్ గౌబా తన తొమ్మిది మంది అనుచరులతో కలిసి అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. కాగా ఎన్ ఐఏ దిబ్రూగఢ్ జైలు నుంచి ఇందిరపాల్ సింగ్ ను గురువారం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.