టీఎంసీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​

BJP fire on TMC MP's inappropriate comments

Dec 11, 2024 - 19:23
 0
టీఎంసీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​

కేంద్రమంత్రి సింధియాకు క్షమాపణలు చెప్పిన కళ్యాణ్​ బెనర్జీ
విపత్తు నిర్వహణ సవరణ బిల్లుపై చర్చ
సమర్థించిన కేంద్రమంత్రి నిత్యానంద్​ రాయ్​
సమావేశాలు 12కు వాయిదా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: టీఎంసీ ఎంపి కళ్యాణ్​ బెనర్జీ కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాపై పార్లమెంట్​ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభలో బుధవారం తీవ్ర గందరగోళం చెలరేగింది. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్​ చేశారు. దీంతో సభ అరగంటపాటు వాయిదా పడింది. అనంతరం స్పీకర్​ కల్పించుకొని బెనర్జీ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చెప్పారు. సభ ప్రారంభమయ్యాక బెనర్జీ ఎంపి సింధియాకు క్షమాపణలు తెలిపారు. సభలో ‘విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు–2024’ను కేంద్ర మంత్రి నిత్యానంద్​ రాయ్​ సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కరోనా మహమ్మారి సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేదని ఆరోపించారు. ఇంతలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా అతని అభిప్రాయాన్ని వ్యతిరేకించడంతో, ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం ప్రారంభమైంది. ఆత్మగౌరవ స్ఫూర్తితో సభలో ప్రతీఒక్కరూ వ్యవహరించాలని వ్యక్తిగత దాడులకు సభలో స్థానం లేదని సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కరోనా సమయంలో కేంద్రం పంపిన వ్యాక్సిన్లకు కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం క్లియరెన్స్​ ఇవ్వలేదన్న విషయాన్ని కేంద్రమంత్రి నిత్యానంద్​ రాయ్​  గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఆ సమయంలో తీసుకున్న చర్యలు ఏమిటన్నది ప్రపంచానికి తెలుసని, దేశ ప్రజలకూ తెలుసని మంత్రి తెలిపారు. పైగా కీలక సమయంలో వ్యాక్సిన్లు తీసుకోవద్దని ప్రజలను తప్పుదోవ పట్టించడం, మభ్యపెట్టడం, భయపెట్టడం చేశారని మండిపడ్డారు. ఇతర దేశాలకు కూడా కోట్లాది వ్యాక్సిన్లను పంపిణీ చేశామని, పశ్చిమ బెంగాల్​ కు సహాయం చేయలేదన్నది శుద్ధ అవాస్తవమని జ్యోతిరాధిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జీరో అవర్​ లో మణిపూర్​, జార్జ్​ సోరోస్​ ఆరోపణలపై కాంగ్రెస్​ ఎంపీ గౌరవ్​ గొగోయ్​ మాట్లాడారు. దీనికి ప్రతిగా కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ సమాధానం ఇస్తూ దేశాన్ని సోరోస్​ తో కలిసి అస్థిరపరిచే కుట్రలకు కాంగ్రెస్​ తెరతీసిందన్నారు. సాయంత్రానికి కూడా సభలో గందరగోళం తగ్గకపోవడంతో మరోసారి సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. 

విపత్తు నిర్వహణ సవరణ బిల్లు–2024..
2005 విపత్తు నిర్వహణ బిల్లులో కీలక సవరణలు చేస్తూ 2024లో ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లులో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్​ డీఎంఎ), రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల (ఎస్​ డీఎంఎ) సమర్థవంతమైన పనిని బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి బదులుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో విపత్తు ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఎన్​ డీఎంఎ, ఎస్​ డీఎంఎలకు ఈ బిల్లు అధికారం ఇస్తుంది. రాష్ట్ర రాజధానులు, మునిసిపల్ కార్పొరేషన్‌తో కూడిన నగరాల కోసం ప్రత్యేక అర్బన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడానికి కూడా బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో విపత్తుల డేటాబేస్‌ను రూపొందించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎస్​ డీఆర్​ఎఫ్​) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బిల్లు అధికారం ఇస్తుంది.