బీసీ జనగణన తర్వాతే.. పంచాయతీ ఎన్నికలు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు గోడల మధ్య మేము నిర్ణయాలు చేయడం లేదు.. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అంటాం..
నా తెలంగాణ, హైదరాబాద్ : బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు చేయడం లేదని తేల్చి చెప్పారు. తామది ప్రజా ప్రభుత్వమని ప్రజల మధ్యలో వారి అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెట్టిందన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను సక్రమంగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి అవినీతి లాంటి అనేక విధ్వంసలు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా కూడా మిగలదన్నారు. పేకమేడలా కూలిపోతుందని వ్యాఖ్యానించారు. అది కూడా వారే కూల్చుకుంటున్నారని తెలిపారు. ధనిక రాష్ట్రం అని బయటకి గొప్పలు చెప్పి లోపల అప్పులు చేసిందని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం నుంచి సాయం అడిగితే నామోషీ అని మిషన్ భగీరథ లాంటి వాటికి నిధులు అడగలేదన్నారు. గొప్పలు చెప్పిన మిషన్ భగీరథ పథకం నీళ్లు ఇంకా 30 శాతం మందికి చేరలేదన్నారు. వేలాది కోట్ల ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాము అని.. దానిని ఇంకా చంపాలని అనుకోవడం లేదన మంత్రి వ్యాఖ్యానించారు. వారు చేసిన పాపాలను దిగమింగుకోలేక చెప్పాల్సి వస్తుందన్నారు. ‘ధరణి’ పేరుతో దోచుకున్నారన్నారు. ధరణి చట్టాన్ని సవరించబోతున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అంటామని, చెడును మాత్రమే చెప్పమని స్పష్టం చేశారు.