హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తావు?

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ..అలీ ఆధ్వర్యంలో  రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

Jul 20, 2024 - 01:25
 0
హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తావు?

నా తెలంగాణ, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. హరీశ్‌రావు ఎప్పుడు రాజీనామా చేస్తారో? చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేయడం బీఆర్ఎస్‌కు ఇష్టం లేదని, అందుకే అవాకులు చెవాకులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డిలో కాంగ్రెస్ రైతుర్యాలీ నిర్వహించింది. రుణమాఫీ సంబరాల్లో భాగంగా రైతు వేదిక వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అలీ మాట్లాడారు. బీఆర్ఎస్‌ పార్టీ త్వరలో జీరో కాబోతుందని జోష్యం చెప్పారు.  బీఆర్ఎస్‌ నేతలకు రుణమాఫీ గైడ్ లైన్ తెలియకుండానే గతంలో రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. ఇంటికి ఒక్క రుణమాఫీ అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌ నేతల మాటలు నమ్మవదని ప్రజలకు పిలుపునిచ్చారు. పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రుణమాఫీ చేయదని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారని అలీ గుర్తుచేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాలకు మతి బ్రమించిందని వ్యాఖ్యానించారు. రుణమాఫీకి కృతజ్ఞతగా రైతులతో వరంగల్‌లో రాహుల్ గాంధీతో భారీ సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పంట రుణాల మాఫీ అసాధ్యమని ప్రతిపక్షాలు మాట్లాడినా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి మరీ గడువుకు ముందే మాటనిలబెట్టుకున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన 8 నెలల్లోనే అసాధ్యమన్న దాన్ని సుసాధ్యం చేశారన్నారు.