త్వరలో జాబ్ క్యాలెండర్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలు ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు పరీక్షల వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది : మల్లు రవి
నా తెలంగాణ, హైదరాబాద్ : త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో గ్రూప్ –2 అభ్యర్థులతో భట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ చివరి వారంలో గ్రూప్ –2 నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ –2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామన్నారు. ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని తెలిపారు. గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవన్నారు. సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే తమ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు.
కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని భట్టి తెలిపారు. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ లో పాఠాలు బోధిస్తారని చెప్పారు. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చునన్నారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తామన్నారు.