- బతుకమ్మ, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు
- ప్రత్యేక రైలుకు సహకరించిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు
- మూడు రాష్ట్రాలకు చేకూరనున్న ప్రయోజనం
- అంతర్జాతీయ విమానాశ్రయంలా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ
- త్వరలో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం
- ఢిల్లీ తరువాత వందేభారత్ లు అత్యధికంగా సికింద్రాబాద్ నుంచే
- ఐదు రాష్ట్రాలకు వందశాతం ఆక్యుపెన్సీతో ప్రయాణం
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణాలో వేగం పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంకితభావం, చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి గోవాకు నడిచే ప్రత్యేక రైలును జెండా ఊపి ఉంది.
రైల్వే పనులు వేగవంతం..
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో రైల్వేలకు సంబంధించి గత పదేళ్లలో కొత్త రైల్వే లైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యాయని పలుచోట్ల వేగంగా కొనసాగుతున్నాయని. సికింద్రాబాద్ (లష్కర్) నుంచి గోవాకు ప్రత్యేక రైలును ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ–గోవా ప్రయాణాలకు ఇబ్బందులను తప్పించాం..
తెలంగాణ ప్రజలు గోవాకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైలు అవసరాన్ని ప్రధాని, కేంద్రమంత్రులకు తెలిపానని చెప్పారు. ఈ ప్రత్యేక రైలు కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహాబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్, డోన్, గుంతకల్లు, హోస్పేట్, ధార్వాడ్, మడ్ గావ్ నుంచి గోవాలోని వాస్కోడిగామా రైల్వే స్టేషన్ కు చేరుతుందన్నారు.
రైల్వే లైన్లకు కేంద్రం పెద్ద యెత్తున నిధులు..
తెలంగాణ రైల్వేలైన్లకు పెద్ద యెత్తున కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు. రైల్వే నెట్ వర్క్ లో తెలంగాణ అభివృద్ది చెందిన రాష్ర్టంగా నిలుస్తుందన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఎలక్ర్టిఫికేషన్ పూర్తయ్యిందన్నారు. హైస్పీడ్ వైఫై సౌకర్యం కూడా కల్పించామన్నారు. చర్లపల్లి టెర్మినల్ గా మార్చామన్నారు. సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్, నాంపల్లి, కాచిగూడ టెర్మినళ్లకు అదనంగా చర్లపల్లి కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతోందన్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి టెర్మినల్ ను అభివృద్ధి పరిచామన్నారు.
వచ్చేయేడాదికి సికింద్రాబాద్ సిద్ధం..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆధునీకరిస్తున్నామన్నారు. రూ. 715 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకికరణ పనులు వచ్చే సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయన్నారు. పనులు పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక సౌకర్యాలు, వైఫైలు ఉంటాయన్నారు.
మరో 40 స్టేషన్ల ఆధునీకరణకు రూ. 2,220 కోట్లు..
దీంతోపాటు కాచిగూడ రూ. 425 కోట్లు, నాంపల్లి రూ. 429 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. చర్లపల్లి టెర్మినల్ రూ. 415 కోట్లతో చేపట్టామని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీంతో నగరానికి ట్రాఫిక్ భారం కూడా తగ్గుతుందన్నారు. ఇవే గాక తెలంగాణలోని మరో 40 స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఇందుకు గాను రూ.2,220 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
నాగ్ పూర్ ఆక్యుపెన్సీ పెంచుతాం..
దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ఢిల్లీ తరువాత అత్యధికంగా నడిచేది సికింద్రాబాద్ నుంచే అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బెంగుళూరు, తిరుపతి, విశాఖపట్నం, నాగ్ పూర్ లకు వందేభారత్ లు నడుస్తున్నాయన్నారు. నాగ్ పూర్ తప్ప అన్ని రైళ్లు వందశాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయని తెలిపారు.
కాజీపేటలో రైల్వే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్..
కాజీపేటలో రూ. 521 కోట్లతో రైల్వే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే మూడు వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగా మరికొందరికి ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందన్నారు. ఇక్కడ వ్యాగన్లు, కోచ్ లు, ఇంజన్లు తయారవుతాయన్నారు.
జహీరాబాద్ ఇండస్ర్టీయల్ కారిడార్ కు రూ. 2,362 కోట్లు..
రూ. 4,109 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం–-మల్కాన్‌గిరి మధ్య 173 కి.మీ.ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడిందని తెలిపారు. ఇటీవల కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 12 ఇండస్ర్టీయల్ కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. అందులో తెలంగాణలోని జహీరాబాద్ కూడా ఉందన్నారు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ. 2,361 కోట్లను కేటాయించిందన్నారు. ఇండస్ర్టీయల్ కారిడార్ ఏర్పాటుతో రూ. 10వేల కోట్ల పెట్టుబడులతోపాటు 1.74 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
హైదరాబాద్–నాగ్ పూర్ రహదారి పనులు త్వరలో ప్రారంభం..
హైదరాబాద్-–నాగ్‌పూర్ మధ్య రూ.6,661 కోట్లతో జాతీయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. దీని ద్వారా కనెక్టివిటీ సులభతరం అవుతోంది. మౌలిక వసతులు, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెరుగుతుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
సికింద్రాబాద్ – గోవా రైలు..
బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామ నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణమవుతుంది. ప్రత్యేక రైలు ఏర్పాటుతో మూడు రాష్ట్రాలు ప్రజలకు ప్రయాణం సులభతరం కానుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, గోవాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడ అదనంగా. ఈ మూడు అంశాలలో పర్యాటక రంగంలోనూ పెరుగుదల నమోదవుతుందని పేర్కొంది.