జైపాల్​ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ అప్పుడే గెలిచేది

సీఎం రేవంత్ రెడ్డి

Jul 29, 2024 - 00:27
 0
జైపాల్​ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ అప్పుడే గెలిచేది

తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేదందుకే
పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​ ఓటమి తప్పదు
ప్రతిపక్ష హోదానూ నిర్వర్తించలేకపోతున్నది
కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ

నా తెలంగాణ, హైదరాబాద్​ : కాంగ్రెస్​ అధిష్ఠానం 2014లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డిని తెలంగాణ సీఎం అభ్యర్ధిగా ప్రకటించి ఉంటే.. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చేదని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వ్యాఖ్యానించారు. అలా చేయకపోవడంతోనే అప్పట్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని అభిప్రాయపడ్డారు. జైపాల్‌రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని చెప్పారు. కల్వకుర్తి ప్రజలతో వాదించి గెలవడం కష్టమని, ప్రజా సమస్యల పరిష్కారంలో కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత ఉందని సీఎం రేవంత్‌ కొనియాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధుల్లో జైపాల్‌రెడ్డి నేర్పించిన విలువలు కనిపిస్తుంటాయని పేర్కొన్నారు. ఆదివారం నాగర్​ కర్నూల్​ జిల్లా కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్ర మాజీమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. నమ్మిన సిద్ధాంతం ప్రకారం రాజకీయాలు చేసిన జైపాల్​ రెడ్డి పదవులకే గౌరవం తెచ్చారన్నారు. 

పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్​ఎస్​ గెలవదు..

అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల మాదిరిగానే వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతిపక్ష బీఆర్​ఎస్​ పార్టీకి ఘోర పరాభవం తప్పదని సీఎం రేవంత్​ రెడ్డి జోస్యం చెప్పారు. గత రెండు ఎన్నికల్లో అధికారం ఓటమీ పాలైన బీఆర్​ఎస్​ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ స్పష్టంగా కనబడుతున్నదని వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా సరిగా పోషించలేకపోతున్నదని చెప్పారు. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా గెలిచేదని వ్యాఖ్యానించారు. పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదని, కేసీఆర్‌ కుటుంబానికి కష్టాలు వచ్చాయని సీఎం రేవంత్‌ ఎద్దెవా చేశారు.