లార్డ్ బిర్సా ముండా సేవలు ఎనలేనివి
ముర్మూని నియమించడం దేశానికి గర్వకారణం
వారసత్వాన్ని కాపాడుకుంటాం
పాట్నా: ఆదివాసీ, గిరిజన సమాజాన్ని భారతదేశ వారసత్వాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. వీరి పోరాటాలను త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. తమ ప్రభుత్వం దేశాధ్యక్షురాలిగా ద్రౌపదీ ముర్మూని నియమించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది తమకు దక్కిన గౌరవమని ప్రధాని చెప్పారు. లార్డ్ బిర్సా ముండాసేవలను కొనియాడారు. ఆయనకు నివాళులర్పించారు. గిరిజన వారసత్వాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా అనేక మ్యూజియంలు, పరిశోధనా కేంద్రాలను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
బిర్సాముండా జయంతి సందర్భంగా బిహార్ జాముయి లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలే గిరిజనుల శ్రేయస్సుకు ప్రారంభించిన ధర్తి ఆబా గిరిజన ఉత్కర్ష్ అభియాన్ ని గుర్తు చేశారు. గిరిజన సమాజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం చాలామంది గిరిజనులకు పద్మ అవార్డులు అందజేసిందన్నారు. ఎంతోమంది మహానీయ గిరిజనుల పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేశామని గుర్తు చేశారు.
గిరిజనుల శ్రేయస్సుకు రాష్ర్టపతి ముందడుగు..
రాష్ర్టపతిగా ద్రౌపదీ ముర్మూని ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఆమె నిరంతరం వెనుకబడిన గిరిజనుల శ్రేయస్సుకు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. పీఎం జన్మన్ యోజన ద్వారా గిరిజనుల్లో ఆర్థిక పరిపుష్టి కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇల్లు, విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్, నీరు ఇలా మౌలిక సదుపాయాల కల్పన పెద్ద యెత్తున చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వాలు వీరి శ్రేయస్సును ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దీంతో గిరిజన, ఆదివాసీ జాతులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మోదీ ఆరోపించారు. బిహార్ లో నితీశ్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడం హర్షణీయమన్నారు.
ప్రధానికి సాంప్రదాయ స్వాగతం..
ఈ కార్యక్రమానికి గిరిజన మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున జాముయికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ప్రధాని మోదీ రాక సందర్భంగా పలువురు మహిళలు తమ తమ సాంప్రదాయ పద్దతిలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, గిరిరాజ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా, సామ్రాట్ చౌదరి, జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సహా పలువురు నేతలు, మంత్రులు హాజరయ్యారు.
మోదీ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు..
ప్రధాని మోదీ హయాంలో ఆదివాసీ, గిరిజన సంక్షేమానికి పెద్ద యెత్తున చర్యలు తీసుకున్నారు. బిర్సాముండా జయంతిని 2021 నవంబర్ 15 నుంచి అధికారికంగా నిర్వహిస్తూ ప్రైడ్ డేగా ప్రకటించారు. గిరిజనుల అభివృద్ధికి 41 మంత్రిత్వ శాఖల ద్వారా 214 పథకాలకు రూపకల్పన చేశారు.
ఆరేళ్లలో రూ.5 లక్షల కోట్లకు పైగా కేటాయింపులు..
గిరిజనుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లలో 2019 నుంచి 25 వరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులో ఎస్టీసీ నిధి కింద రూ. 5,17,000 కోట్లకు పైగా కేటాయించింది.
పదేళ్లలో గిరిజన మంత్రిత్వ శాఖకు ఇచ్చిన మొత్తం..
2015 – 16 లో రూ. 4495 కోట్లు
2016 – 17 లో రూ. 4822 కోట్లు
2017 – 18 లో రూ. 5318 కోట్లు
2018 – 19 లో రూ. 5995 కోట్లు
2019 – 20 లో రూ. 7328 కోట్లు
2020 – 21 లో రూ. 5021
2021 – 22 లో రూ. 5495
2022– 23 లో రూ. 7301 కోట్లు
2023 – 24 లో రూ. 12462 కోట్లు
2024 – 25 లో రూ. 13000 కోట్లు
గిరిజానాభివృద్ధే లక్ష్యం..
పదేళ్లలో రూ. 18వేల కోట్లకు పైగా స్కాలర్ షిప్ లను అందజేసింది. గిరిజన విద్యాభివృద్ధి కోసం కేంద్రం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాలను ప్రారంభించింది. ఇందుకోసం 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ. 6399 కోట్లను కేటాయించింది. గత పదేళ్లలో ఈ తరహా గిరిజన విద్య పాఠశాలల పెంపు 22 శాతానికి చేరింది. అదే సమయంలో అటవీ ఉత్పత్తులతో గిరిజనులు రూపొందించిన 85 రకాల వస్తువులకు ఎంఫ్ పీ (మినిమం ఫేర్ ప్రైస్) ధరల కింద తీసుకువచ్చింది. 2014–15లో 55 లక్షల ఎకరాలుగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు ఉండగా, వాటిని 2023–24 నాటికి 181 లక్షల ఎకరాలకు పెంచగలిగింది. పీఎం ఆదర్శ్ గ్రామ్ యోజన కింద రూ. 2216 కోట్లను విడుదల చేసింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద 148 లక్షల కంటే ఎక్కువ మరుగుదొడ్లను గిరిజన ప్రాంతాల్లో నిర్మించారు. 2.55 లక్షల అంగన్ వాడీలను స్థాపించారు. సికిల్ సెల్ అనీమియా నుంచి గిరిజనులకు రక్షణ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత పది సంవత్సరాలలో 23 లక్షల గిరిజనులకు ఇంటి పట్టాలను జారీ చేసింది.
ధరి ఆబా గిరిజన గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ను 2024 అక్టోబర్ 2న ప్రారంభించారు. ట్రైబల్ ఫ్రైడే, పీఎం జన్మాన్ ట్రైబల్, మేజర్ ధ్యాన్ చంద్ మహోత్సవ్, నేషనల్ ట్రైబల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్, పీఎం ఎఎజీవై ఇలా అనేక కార్యక్రమాలలో ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేసింది.