ఆర్థిక రాజధాని పీఠం ఎవరిదో?
బాలీవుడ్, బడా వ్యాపారులంతా ఇక్కడే
ఎగుమతులు, దిగుమతులు అత్యధికం
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు సరిహద్దులు
తలసరి ఆదాయం అత్యధికం
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో నెంబర్ వన్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్రచర్చ జరుగుతోంది. ఇక్కడ అధికారం చేపట్టే పార్టీలు దేశంలో చక్రం తిప్పుతాయని ఆర్థిక వేత్తలు భావిస్తారు. వాస్తవంగానూ ఢిల్లీ కంటే మహారాష్ట్ర ఆర్థికంగా దేశవ్యాప్తంగా ఎంతో బలోపేతమైనది. ఇటు ఉత్తరాది, అటు దక్షిణాధి రాష్ర్టాల సరిహద్దులను కలిగి ఉండడతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. మరోవైపు ఈ ప్రాంతానికి సముద్రమార్గం మరో అవకాశంగా నిలుస్తుంది. ప్రపంచదేశాల నుంచి దిగుమతులు, ఎగుమతులు ఆది నుంచి ఈ రాష్ట్రం ద్వారానే జరిగేవి. దీంతో మహారాష్ట్ర ఆర్థికంగా బలపడింది. ముంబాయి నగరంగా, వ్యవసాయపరంగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి ఉండడంతో నేరుగా ఇక్కడి నుంచే అధికంగా ఎగుమతులు, దిగుమతులను కేంద్రం అనుమతించేది. అందుకే ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
బాలీవుడ్ నటులు, ప్రముఖ వ్యాపార వేత్తలు, నాయకులు, ఉన్నతస్థాయి వర్గాలంతా మహారాష్ట్రలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అందుకే ముంబాయి నగరాన్ని ‘అంచీ ముంబాయి’ అని అంటారు. కాలక్రమేణా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో మహా ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గినా ముంబాయికి ఉన్న ప్రతిష్ఠ మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక్కడ ఆది నుంచి మరాఠాలదే పై చేయి అయినప్పటికీ క్రమేణా రాజకీయాల్లోనూ మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి.
ఆదాయం..
దేశంలోని అన్ని రాష్ట్రాలు కంటే మహారాష్ట్ర తలసరి ఆదాయం అత్యధికం. వృద్ధి రేటు సగటున యేడాదికి రూ. 7.6 శాతం. 2023–-24లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.40,44,251 కోట్లుగా ఉంది. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి రూ.42,67,771 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2023–-24 కంటే 5.5 శాతం ఎక్కువ. అదే సమయంలో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ జీడీపీకి మహారాష్ట్ర సహకారం అత్యధికం. దేశ జీడీపీలో మహారాష్ట్ర వాటా 13.9 శాతం. ఇది స్వయంచాలకంగా రాష్ట్రానికి ఆర్థిక రాజధాని హోదాను ఇస్తుంది.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో నంబర్ వన్..
దేశంలో ప్రస్తుతం ఉన్న పెద్ద కంపెనీల ప్రధాన కార్యాలయాలు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో సగటు తలసరి ఆదాయం కూడా బాగుంది. ఈ కారణంగానే ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో దేశంలోనే మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రలో ప్రత్యక్ష పన్ను రూ.7,61,716.30 కోట్లు వచ్చింది. దేశవ్యాప్తంగా వసూలైన మొత్తం ప్రత్యక్ష పన్నులో ఒక్క మహారాష్ట్ర నుంచే 39 శాతం రావడం గమనార్హం.
తలసరి ఆదాయంలో 6..
2023–-24కి సంబంధించి మహారాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, రాష్ట్ర తలసరి ఆదాయం యేటా రూ.2,52,389గా ఉంది. దేశంలో ఆరో స్థానంలో ఉంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో దేశ మొత్తం ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 16 శాతం. జాతీయ పారిశ్రామికోత్పత్తికి మహారాష్ట్ర 20 శాతం సహకరిస్తోంది. ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 వరకు, మహారాష్ట్ర 67.21 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.