డీఎంకేకు జవాబు చెబుతారు

అభివృద్ధిని వ్యతిరేకిస్తోంది డ్రగ్స్​ మాఫియా రాజ్యమేల్లుతోంది పసిమొగ్గలనూ చిదిమేస్తున్నారు వేలూరు సభలో ప్రధానమంత్రి మోదీ

Apr 10, 2024 - 15:02
 0
డీఎంకేకు జవాబు చెబుతారు

చెన్నై: ఎన్నికల్లో డీఎంకే చేసిన అవినీతి, అక్రమాలకు ప్రజలు జవాబు చెప్పనున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం తమిళనాడులోని వేలూరు మెట్టుపాళయంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తమిళనాడు అభివృద్ధి భారతదేశానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

డీఎంకే మాత్రం తమిళనాడును అభివృద్ధిని వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఇంకా పాత ఆలోచనలు, పాత రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. డీఎంకే మొత్తం కుటుంబ సంస్థగా మారిపోయి తమిళనాడుకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ తత్వ పార్టీలతో తమిళనాడుకు ఒరిగేదేం లేదన్నారు. దీంతో ఇక్కడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్న చందంగా ఉంటోందన్నారు. డీఎంకే పార్టీకి కుటుంబ రాజకీయాలు, అవినీతి సంపాదన, తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకంగా వెళ్లడమే ముఖ్యమన్నారు. దేశ భవిష్యత్తును, చిన్న పిల్లలను సైతం డీఎంకే వదల్లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. పాఠశాలల విద్యార్థులు కూడా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి బాధితులుగా మారడంలో డీఎంకే హస్తం ఉందని ఆరోపించారు. డ్రగ్​ మాఫియాకు రక్షణ ఎవరు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన డ్రగ్స్ వ్యాపారి ఏ కుటుంబానికి చెందినవాడని ప్రశ్నించారు. ఈ పాపలన్నింటికీ తమిళ ప్రజలు ఎన్నికల్లో సమాధానం ఇవ్వనున్నారని పేర్కొన్నారు. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

తమిళనాడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరం తమిళనాడు అభివృద్ధి పయనంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. తమిళ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని ఆ దేవదేవుడు మురుగన్​ ను కోరుకుంటున్నానని ప్రధానమంత్రి తెలిపారు. మురుగన్​ పాదాలకు మోదీ నమస్సులను సమర్పిస్తున్నానని, తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. 

చరిత్ర సృష్టించబోతున్నాం..

తమిళ ధరిత్రిలో బీజేపీ, ఎన్డీయే కూటమి నూతన చరిత్ర సృష్టించబోతున్నాయని తెలిపారు. దేశ, రాష్ర్ట భవిష్యత్​ కోసం ఇక్కడి ప్రజల సహాయ సహకారాలు తమకు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.