తెరుచుకున్న పూరి రత్న భాండాగారం
గది మరమ్మత్తుల తరువాత సంపద లెక్కింపు
భువనేశ్వర్: పూరి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ రత్నభాండాగారం మరోసారి తెరుచుకుంది. వారంలో రెండోసారి ఈ రత్న భాండాగారాన్ని గురువారం ఎస్టేటీఏ అధికారులు తెరిచారు. అక్కడి విలువైన వస్తువులను స్ట్రాంగ్‌రూమ్ కు తరలించనున్నారు. ఉదయం 8 గంటల తరువాత ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. 11 మంది ఎస్టేటీఏ అధికారుల మధ్య సంపదను తరలించనున్నట్లు పేర్కొన్నారు. సంపద తరలింపును మొత్తం వీడియో మాధ్యమంగా రికార్డు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అరవింద పాధి విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 14న రత్నభాండాగారం రెండు గదులను తెరిచామన్నారు. సమయాభావం వల్ల సంపదను తరలించలేకపోయామన్నారు. గురువారం ఈ సంపదను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్ లకు తరలిస్తామన్నారు. అనంతరం ఈ గదిలో మర్మత్తులు చేపట్టేందుకు పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు. గది మరమ్మతులు పూర్తి అయిన తరువాత గదిలోకి సంపదను తరలించి లెక్కింపు చేపడతామని తెలిపారు.