మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’
Modi 'Make in India'
- 2024–25లో రూ. 20వేల కోట్ల ఎగుమతులే లక్ష్యం
- పిలుపును అందిపుచ్చుకుంటున్న దేశీయ సంస్థలు, విదేశాంగ శాఖ
- పనితీరు మెరుగు, నాణ్యమైన ఉత్పత్తల అందజేతతో ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల
- బిహార్ బూట్లు, కశ్మర్ బ్యాట్లు, సైకిళ్లు, అమూల్ పాలు, రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో వృద్ధి నమోదు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపు సత్ఫలితాలను సాధిస్తోంది. దేశంలోని ఆయా రంగాల బలోపేతంతో ప్రధాని పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పిలుపును భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అనువుగా వినియోగించుకుంటూ విదేశాలతో వ్యాపార, వాణిజ్యాలలో గణనీయమైన ఎగుమతిని సాధించగలుగుతుంది. అదే సమయంలో దేశీయ రంగాల ఉత్పత్తిని పెంచగలగడంలోనూ కేంద్ర ప్రభుత్వం కీలక భూమికను పోషించడంలో విజయం సాధిస్తోంది. ఆయా సత్ఫలితాల వల్ల భారతీయ ఎగుమతుల రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రపంచదేశాల్లో ఎగుమతుల రంగంలో క్రమేణా చైనాను వెనకకు నెట్టే చర్యలను ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ చేపడుతోంది. దేశీయ రంగాలకు ఆర్థిక సహకారం అందజేయడంతోపాటు వారిని అన్ని రంగాల్లో ప్రత్యేకంగా శిక్షణనిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను అందించేలా తీర్చిదిద్దుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో చేపట్టిన చర్యల వల్ల దేశ ఆర్థిక రంగం గాడిన పడడమే గాకుండా మెరుగైన వృద్ధిని సాధించగలుగుతోంది. మరోవైపు మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2024లో రూ. 20వేల కోట్ల ఎగుమతులే లక్ష్యంగా పెట్టుకుంది.
మూడోసారి ప్రధానిగా పదవీ పగ్గాలు చేపట్టాక ప్రధానమంత్రి ఆస్ట్రియా, రష్యా పర్యటనలు చేపట్టారు. ఇంకా అనేక దేశాల పర్యటనలు చేపట్టాల్సి ఉంది. గతపదేళ్లో చేపట్టిన పర్యటనల ఫలితాలు సత్ఫలితాలను సాధిస్తుండడంతో అదే దిశలో విదేశాలతో సత్సంబంధాలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని బృందం దృష్టి సారించింది.
విదేశాలకు భారత సైకిళ్లు..
భారత్ లో తయారైన సైకిళ్లు అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ లలో బాగా అమ్మకాలు పెరిగాయి. దీంతో ఈ రంగం గణనీయమైన ఎగుమతులను సాధిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఎగుమతులు రికార్డులను సృష్టించడం విశేషం.
రష్యాకు బిహార్ నాణ్యమైన బూట్లు..
ఇక బిహార్ లో తయారైన షూ (బూట్ల)ను రష్యన్ సైన్యం వినియోగస్తుంది. ఇక్కడి బూట్ల తయారీలో అత్యధిక నాణ్యత పాటిస్తుండడం వల్ల వీటి ఎగుమతిలో బిహార్ ముందువరుసలో ఉంది. కొనుగోలులో రష్యా ముందుంది. గతేడాది రష్యన్ సైన్యం రూ. 100 కోట్ల విలువైన 1.5 మిలియన్ బూట్ల జతలను కొనుగోలు చేసింది. 2024–25కు సంబంధించి ఈ కొనుగోళ్లను 50 శాతానికి పెంచుకోవాలనే దిశగా మరింత నాణ్యతను, ఉత్పత్తిని కొనసాగిస్తోంది. రష్యాకు బిహార్ లోని కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అత్యధిక నాణ్యతతో కూడిన బూట్లను తయారు చేసి అందజేస్తోంది.
ఎగుమతుల్లో టాప్ కశ్మీర్ నాణ్యమైన బ్యాట్లు..
కశ్మీర్ లో తయారయ్యే నాణ్యమైన బ్యాట్లకు ప్రపంచవ్యాప్త క్రికెట్ క్రీడాప్రియులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారైన మన్నికైన బ్యాట్లు భారత్ తోపాటు పలు విదేశాల్లో గణనీయమైన అమ్మకాలు నమోదవుతున్నాయి. దీనివల్ల కశ్మీర్ నుంచి బ్యాట్ల ఎగుమతులు ప్రపంచదేశాలకు కొనసాగుతున్నాయి. దీంతో ఈ రంగంలో కశ్మీర్ స్వయం సమృద్ధి సాధించినట్లవుతోంది. ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతోంది.
అమూల్ పాలు..
అమెరికా, సహా పలు దేశాలకు భారత్ లో ఉత్పత్తి అయిన అమూల్ పాలు భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. నాణ్యత విషయంలో రాజీ లేకపోవడం, అమెరికా నాణ్యతా ప్రమాణాలకు సరితూగడంతో పాల ఉత్పత్తి, ఎగుమతులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
యూపీఐ చెల్లింపులు..
ఇక పలు దేశాలు భారత్ యూపీఐ డిజిటల్ విధానంలో చెల్లింపులకు ముందుకు వచ్చాయి. రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్,మారిషస్, శ్రీలంక తదితర దేశాల్లో యూపీఐ విధానం ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. దీని ద్వారా వ్యాపార, వాణిజ్య చెల్లింపులు సరళీకృతం కావడంతో ఆయా రంగాల్లో పెరుగుదల సాధ్యపడుతోంది.
పెరుగుతున్న ఆయుధ రంగ ఎగుమతులు..
ఆయుధ రంగంలోనూ భారత్ గణనీయమై ఉత్పత్తినే గాక ఎగుమతులను కూడా సాధిస్తోంది. దేశీయంగా ఉన్న అనేక సంస్థలను బలోపేతం చేసింది. ఈ సంస్థల ద్వారా వస్తున్న ఆయుధాలు, బ్రహ్మోస్, ఆకాష్, తేజస్ లాంటి కిపణులు, హెలికాప్టర్లను కూడా భారత్ ఎగుమతులు చేసే దిశగా దూసుకువెళుతోంది. అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియాలోని పలు దేశాలు భారత్ సంస్థల ద్వారా రూపొందిన ఆయుధాలపై అత్యంత నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో రక్షణ రంగలోనూ ఎగుమతులు పెద్ద యెత్తున పెరుగుదలను నమోదు చేస్తోంది.