శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి
నూతన టీటీడీ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి
కలియుగ దైవం ఆధ్యాత్మికతను కాపాడుకోవాలి
రాజకీయ ప్రకటనలు, వ్యాఖ్యలు నిషిద్ధం
నా తెలంగాణ, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతోకాలంగా హిందువులు కానటువంటి వారు పనిచేయొద్దనే టీటీడీ నూతన బోర్డు తొలి సమావేశ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకుందని వివరించారు. తొలిబోర్డు సమావేశంలోనే సాహసోపేతమైన నిర్ణయాలపై హర్షం వ్య్తక్తం చేశారు.
ఆధ్యాత్మికత, భగవంతుడిపై విశ్వాసం ఉన్నవారినే నియమించాలని బోర్డు నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిని ఇతర చోట్లకు బదిలీ చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించిందన్నారు. ఈ దేవాలయంలోనే గాకుండా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కూడా ఇదే నిర్ణయాన్ని పాటిస్తూ హిందూ పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవాలయ పరిసరాల్లో రాజకీయ, ఇతర ప్రకటనలు, వ్యాఖ్యలపై కూడా నిషేధం విధించడాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. టీటీడీ పవిత్రతను కాపాడే విషయంలో తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. అత్యంత పురాతన పవిత్ర కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయమన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమని కలియుగ దైవమని ఇక్కడ భక్తితో నడుచుకోవాలని హిందూ సమాజానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.