కరెంట్, నీళ్లు లేక.. ఓయూ హాస్టల్స్ బంద్
Officials have closed hostels in Osmania University due to lack of water and electricity
– సమ్మర్ వెకేషన్ ప్రకటించిన హాస్టల్స్ చీఫ్ వార్డెన్
– మే 1 నుంచి 31 వరకు మెస్, వసతి గృహాలు క్లోజ్
నా తెలంగాణ, హైదరాబాద్: కరెంట్, నీళ్ల కొరతతో ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్, మెస్ లు సమ్మర్ వెకేషన్ లో భాగంగా నెల రోజుల పాటు మూసి వేస్తున్నట్లు హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ప్రకటించారు. విద్యార్థులందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. కాగా ఇటీవల విద్యార్థులు హాస్టల్స్ లో నీళ్లు లేవంటూ.. అర్ధరాత్రి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే వర్సిటీ అధికారులు ఈ నిర్ణయం ప్రకటించడంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వచ్చినందున.. ప్రభుత్వం ఈ నెల రోజులు మెస్, హాస్టల్స్ తెరిచి ఉంచాలని కోరుతున్నారు. ఓయూలో చదువుకునే మెజార్టీ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుంటారు.. ఇప్పుడు వర్సిటీ హాస్టల్స్, మెస్ మూసి వేయడంతో వాళ్లంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.