దేశ చరిత్రలో పీడకల ఎమర్జెన్సీ
బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్
నా తెలంగాణ, నిర్మల్: భారతదేశ చరిత్రలో పీడకల వంటివి ఎమర్జెన్సీ రోజులని, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ కొరవడిన రోజులని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ అన్నారు. ‘ఎమర్జెన్సీ చీకటిదినం’ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులను, ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1977 మార్చి 21వరకు ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేయటమే కాకుండా వాస్తవాలు వెల్లడించే పత్రికలను సెన్సార్ చేయటం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రశ్నించే మేధావులు, పాత్రికేయుల గొంతునొక్కారని, ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే 1975 జూన్ 25న ఒక ‘చీకటి రోజు’గా నిలిచిపోయిందని, దేశ అంతర్గత అస్థిరతను, అశాంతిని కారణంగా చూపిస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారని అన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇదే రోజున ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు హేమాహేమీలైన పలువురు ప్రధాన జాతీయ నేతలు సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టడమే కాకుండా ఎన్నికలు వాయిదా వేశారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసననలను ఉక్కుపాదంతో అణచివేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, సీనియర్ నాయకులు రావుల రామనాథ్, సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మే రాజు, నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ గాదె విలాస్, జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్, బీజెవైఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అర్జున్, మహిళా మోర్చా అధ్యక్షులు రజనీ వైద్య తదితరలు పాల్గొన్నారు.