370ని ఏ శక్తి తీసుకురాలేదు
కత్రా సభలో ప్రధాని నరేంద్ర మోదీ లాల్ చౌక్ లో జెండా ఎగురవేతకు భయపడేవారు ఐఏఎస్ మహ్మద్ షఫీ పండిట్ కు నివాళులు
శ్రీనగర్: ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని తీసుకురాలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్ రెండోదశ ఎన్నికల సందర్భంగా గురువారం రెండో విడతప్రచారంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కత్రాలో నిర్వహించిన రెండో సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఏజెండాను కశ్మీర్ లో అమలు చేసేందుకు బీజేపీ అనుమతించబోదన్నారు. జమ్మూకశ్మీర్ లాల్ చౌక్ కు వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలంటేనే భయపడేవాన్నారు. కానీ ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్, ఎన్సీల ఏజెండా పాక్ తో సమానమని వారి వ్యాఖ్యలను బట్టి తెలిసిపోతుందన్నారు. జమ్మూకశ్మీర్ లో ఐఏఎస్ అధికారి మహ్మద్ షఫీ పండిట్ కు ప్రధాని నివాళులర్పించారు. చీనాబ్ బ్రిడ్జిని నిర్మించకుండా ఎవరు అడ్డుకున్నారో నాకంటే బాగా మీకే తెలుసని జమ్మూకశ్మీర్ ప్రజలనుద్దేశించి అన్నారు. డోగ్రా వారసత్వంపై కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగా దాడికి పాల్పడిందని మండిపడ్డారు. హిందూ దేవుళ్లను కాంగ్రెస్ పార్టీ (యువరాజు) అవమానిస్తుండడాన్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం ఏదైనా ఉందంటే అదే రాజకుటుంబం (కాంగ్రెస్) అని ప్రధాని ఆరోపించారు. ఈ ఎన్నికలను జమ్మూకశ్మీర్ భవిష్యత్ ను నిర్ణయించబోతున్నాయని తెలిపారు. మూడు తరాల రాజకీయ కుటుంబాల వారసత్వ రాజకీయాలకు ఇక చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఓట్ల కోసం దేశ నమ్మకం, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలను ఫణంగా పెట్టేవారిని ఎన్నటికీ నమ్మకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 25వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని ప్రధానమంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.