నా తెలంగాణ, నిర్మల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, పంచాయతీ అధికారులతో బుధవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లాలో 400 గ్రామపంచాయతీలు, 3368 వార్డులు ఉన్నాయని తెలిపారు. 2024 ఫిబ్రవరి 08 ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4లక్షల 40 వేల 997 మంది ఓటర్లుగా ఉన్నారని, అందులో మహిళ ఓటర్లు 2 లక్షల 30 వేల 836, కాగా పురుష ఓటర్లు 2 లక్షల 10 వేల 146 మంది ఉన్నారని వివరించారు.
650 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మారిన వారికి ఒకే ప్రదేశంలో (ప్రస్తుతం వారుంటున్న చోటే) ఓటు హక్కు కల్పించాలన్నారు. చిరునామా మార్పు కోసం ఫారమ్ 6, 8ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా అభ్యంతరాలపై ఈ నెల 21వ తేదీ వరకూ లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాజకీయ పార్టీలు, ఎంపీడీవోలతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా ఈ నెల 26న ప్రచురితం అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్ఓ భుజంగరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, బీజేపీ నాయకులు కె. అంజు కుమార్ రెడ్డి, కొరిపేల్లీ శ్రావణ్ రెడ్డి, టీడీపీ నాయకులు రమేష్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదర్, బీఎస్పీ నాయకులు జగన్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు పరికిపండ్ల స్వదేశ్ తదితరులు పాల్గొన్నారు.