నా తెలంగాణ, నిర్మల్: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ బాలశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించడం బాలశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజా పాలన దినోత్సవం రోజున రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కార్యక్రమ పోస్టర్ల ను ఆవిష్కరిస్తామన్నారు.
విద్యార్థులకు రోజువారి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 52 విద్యాసంస్థల్లో బాలశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఇందులో భాగంగా విద్యార్థులను క్షేత్ర స్థాయి పరిశీలనకు తీసుకువెళ్లి 20 మంది బృందం చొప్పున పలు సేవల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పరచడం ద్వారా విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిఈఓ రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ విజయలక్ష్మి, డిఎఎంహెచ్ఓ రాజేందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.