ప్రధాని మోదీతో మస్క్ భేటీ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విస్తరణకు ఎలన్ ముందడుగు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి భారత్ లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఎలన్ మస్క్ ప్రకటించనున్నారు. సోమవారం భారత్ కు టెస్లా యజమాని ఎలన్ మస్క్ రానున్నారు. ఈ సందర్భంలోనే పెట్టుబడులను ప్రకటిస్తారని బుధవారం రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. భారత్ లో తమకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. పెట్టుబడులను తొలుతగా ముంబై, ఢిల్లీలో పెట్టనున్నారు. అటు పిమ్మట వ్యాపారాన్ని బట్టి మిగతా నగరాలకు విస్తరించనున్నారు. మస్క్ మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా టెస్లాను భారత్ లో నిలపాలనే ఉద్దేశంతో ఉన్నారు.
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పించింది. దీంతో పలు విదేశీ సంస్థలు భారత్ లో తమ పెట్టుబడులకు అనుకూలమైనదిగా భావిస్తున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ దేశంలో పెద్దది. అయితే ఈ సంస్థ 2023లో భారత్ లో అమ్మకాల సంఖ్యలో కేవలం 2 శాతం మాత్రమే నమోదు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 30 శాతంగా ఉండాలని లక్ష్యంగా విధించింది. ఈ నేపథ్యంలో విదేశాల్లోని ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పిస్తుంది. మరోవైపు వీటి విక్రయాల వల్ల భారీ సంఖ్యల పెట్రోల్ ఆదా కానుండడంతో 2030 వరకు కనీసం 30 శాతం పెట్రోల్ పై పెట్టే ఖర్చు మిగులనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ మొత్తం 16 వేల లక్షల కోట్లుగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే భారత్ లో రానున్న కాలంలో ఇంత సంపద కాస్త అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.