యే హై ముంబై కి కహానీ !

Mumbai among top 20 best cities in the world: Time Out survey

Apr 1, 2024 - 16:00
 0
యే హై ముంబై కి కహానీ !

ప్రపంచంలోని ఉత్తమ నగరాల కోసం జనవరి 2024లో “టైం అవుట్” జరిపిన అంతర్జాతీయ సర్వేలో మొదటి 20 స్థానాలలో ముంబైకి 12వ స్థానం దక్కింది. 46.3 హెక్టార్లలో విస్తరించి ఉన్న సహజ సిద్ధమైన బొంబాయి ఓడరేవు దేశంలోని ప్రాచీన ఓడరేవులలో ఒకటి మాత్రమే కాక అతి పెద్దది కూడా. దేశ మొత్తం ఎగుమతులలో 20 శాతం ఇక్కడి నుండి జరగడం విశేషం. అంతే కాదు ముంబై మహానగరం దేశ ఆర్ధిక రాజధానిగా కూడా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ముంబై ప్రపంచంలోని మొదటి పది వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా నిలుస్తున్నది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 6.16 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 25 శాతం, సముద్ర వాణిజ్యంలో 70 శాతం (ముంబయి పోర్ట్ ట్రస్ట్, ధర్మతార్ పోర్ట్ మరియు జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్-జేఎన్ పీటీ) మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో 70 శాతం మూలధన లావాదేవీలకు ఈ మహానగరం ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఇప్పుడు సందడిగా ఉన్న ముంబై మహానగరం కొన్ని శతాబ్దాల కిందట చెల్లాచెదురుగా ఉన్న ద్వీపాల సమూహం అంటే మనకు నమ్మశక్యం కాకపోవచ్చు. ఏడు ద్వీపాల అనుసంధానం ద్వారా బొంబాయి నగరం ఏర్పడింది. ఈ చరిత్ర బహుశా ఈ తరం వారికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముంబై గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

హార్న్‌బీ వెల్లర్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌:

17వ శతాబ్దంలో బొంబాయి మహానగరం ఐల్ ఆఫ్ బొంబాయి, కొలాబా, ఓల్డ్ ఉమెన్స్ ఐలాండ్ లేదా లిటిల్ కొలాబా, మాహిమ్, మజగావ్, పరేల్, వర్లీ అనే ఏడు ప్రధాన ద్వీపాల సమాహారంగా ఉండేది. 1661 మే 11న, ఇంగ్లండ్‌కు చెందిన చార్లెస్-2, పోర్చుగల్ రాజు జాన్-4 తన కుమార్తె కేథరీన్‌ బ్రగాంజాకు కట్నంలో భాగంగా బొంబాయిని ఇవ్వగా అది బ్రిటిష్ సామ్రాజ్యం హస్తగతమయ్యింది. పోర్చుగీసు వారి నుండి తమ ఆధీనంలోకి వచ్చిన బొంబాయిలోని వ్యూహాత్మక ప్రాంతాన్ని వినియోగించుకుని సంపద సృష్టించాలంటే 20 చదరపు మైళ్ల కంటే తక్కువ భూమి మాత్రమే అందుబాటులో ఉండటాన్ని గమనించిన బ్రిటిష్ వారు, అప్పటి బొంబాయి గవర్నర్ విలియం హార్న్‌బీ నేతృత్వంలో “హార్న్‌బీ వెల్లర్డ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్‌”ను 1782లో ప్రారంభించి 1784 లో పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా  బొంబాయిలోని లోతట్టు ప్రాంతాలు సముద్రపు అధిక ఆటుపోట్లతో ముంపుకు గురికాకుండా ఉండేందుకు బొంబాయి, వర్లీ ద్వీపాలను కలుపుతూ కట్ట నిర్మించారు. ఆ తరువాత, 1803లో డంకన్ కాజ్‌వేతో సహా వరుస కాజ్‌వేల నిర్మాణాలు జరిగాయి. అక్కడ స్థానికంగా ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం నిర్మాణ సమయంలో అరేబియా సముద్రపు ఉగ్రమైన అలల తాకిడికి కట్ట గోడలు కట్టినవి కట్టినట్లు కూలిపోతుండటం చూసి దిగ్భ్రాంతికి గురవుతున్న సమయంలో ఒక రోజు ప్రధాన ఇంజనీర్‌ రామ్‌జీ శివ్‌జీ ప్రభుకి కలలో వచ్చిన మహాలక్ష్మి అమ్మవారు, అక్కడ సముద్రంలో మునిగిపోయిన తన విగ్రహాన్ని వెలికి తీసి ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని చెప్పడంతో ఆయన ఆలయం నిర్మించారని, దానితో ప్రాజెక్ట్ ఆ తరువాత నిరాటంకంగా పూర్తి అయ్యిందని అంటారు. మొదట వ్యవసాయం, మానవ నివాసం కోసం గతంలో ముంపుకు గురైన 700 ఎకరాల భూమిని అందుబాటు లోకి తీసుకువచ్చిన తరువాత, మరిన్ని లోతట్టు ప్రాంతాలను వెలికితీసేందుకు మరియు నగరంలోని మిగిలిన ద్వీపాలను అనుసంధానించడానికి ఈ ప్రాజెక్ట్ మరింత విస్తరించింది. తత్ఫలితంగా బొంబాయిలో భారీగా నివాసయోగ్యమైన భూమి అందుబాటులోకి వచ్చింది. 1838 నాటికి, కోలాబా కాజ్‌వే దక్షిణాన ఉన్న కొలాబా ద్వీపాలు మరియు ఓల్డ్ ఉమెన్స్ ఐల్ (లేదా చిన్న కొలాబా) ప్రధాన భూభాగాన్ని బొంబాయికి అనుసంధానించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా  బొంబాయిలోని లోతట్టు ప్రాంతాలు సముద్రపు అధిక ఆటుపోట్లతో ముంపునకు గురికాకుండా వర్లీ క్రీక్‌ను అడ్డుకునే సముద్రపు గోడను నిర్మించారు. 1782లో పూర్తయిన ఈ ప్రాజెక్ట్, 1803లో డంకన్ కాజ్‌వేతో సహా వరుస కాజ్‌వేల నిర్మాణానికి దారితీసింది. ఇది సియోన్‌ను, తర్వాత పరేల్ ద్వీపం యొక్క ఉత్తర భాగంలో, సల్సెట్ ద్వీపానికి కలిపింది; కొలాబా కాజ్‌వే బొంబాయిని కొలాబా మరియు లిటిల్ కొలాబాతో కలుపుతుంది. 1845లో నిర్మించిన మాహిమ్ కాజ్‌వే, మాహిమ్‌ను బాంద్రాతో కలిపింది. ఇలా ఏడు ద్వీపాలను అనుసంధానించి ఒకే భూభాగంగా చేశారు. తరువాతి సంవత్సరాల్లో, బ్యాక్‌బే పునరుద్ధరణ పథకంతో పశ్చిమాన నారిమన్ పాయింట్, మెరైన్ డ్రైవ్‌లో ఇప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లుగా ఈ ప్రాంతం వేగంగా విస్తరించి అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికే బొంబాయి నగరాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు అవసరమైన భూభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ, 1990ల వరకు కూడా పునరుద్ధరణ ప్రాజెక్టులు కొనసాగడంతో కఫె పరేడ్‌తో సహా ఇతర ప్రాంతాలు ఏర్పడ్డాయి.

వాణిజ్యాభివృద్ధి:

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉపఖండంతో వాణిజ్యాన్ని విస్తృతపరచుకునేందుకు వ్యూహాత్మకంగా ఉన్న ద్వీపాలను ఉపయోగించుకుంది. ఇందుకు వారు కీలకంగా మత, వాణిజ్యపరమైన స్వేచ్ఛలతో పాటు అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతంలో నిర్మాణాలను చేపట్టేలా హామీ ఇవ్వడం ద్వారా వలసలను ప్రోత్సహించారు. వారు చేపట్టిన ఈ చర్యలు వ్యాపారులను, మతపరమైన హింస నుండి విముక్తిని కోరుకునే వ్యక్తులను మాత్రమే కాకుండా గోవా నుండి బనియాలతో పాటు పార్సీలు, బోహ్రాలు, యూదులు,  గుజరాతీలను అక్కడ వాణిజ్య కార్యకలాపాలు చేపట్టేలా ఆకర్షించింది. అంతే కాకుండా గల్ఫ్, ఎర్ర సముద్రం నుండి తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అరబ్ వ్యాపారులను స్వేచ్ఛాయుత సముద్ర మార్గం ద్వారా ప్రోత్సహించారు. ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాల విస్తరణ, వారి వలసల అనుకూల చర్యలతో, బొంబాయి జనాభా 1661లో 10,000 నుండి 1675 నాటికి 60,000కి చేరుకుంది. ఈ వాణిజ్యాభివృద్ధి సముద్రం నుండి మరింత భూభాగాన్ని నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చేందుకు ప్రేరేపించింది.

బొంబాయి రాష్ట్రం:

1947 ఆగష్టు 15 న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ నాటి రాజకీయ, చారిత్రక అంశాల దృష్ట్యా తాత్కాలికంగా వివిధ రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ ఐదు వందలకు పైగా సంస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగాయి. 1950లో పూర్వపు బ్రిటిష్-ఇండియా లోని “బొంబాయి ప్రెసిడెన్సీ” (దక్షిణ మహారాష్ట్ర, విదర్భలను మినహాయించి దాదాపుగా ప్రస్తుత మహారాష్ట్రతో సమానం) ని విభజించి భారత దేశం లోనే అతి పెద్ద రాష్ట్రం  “బొంబాయి” సృష్టించబడింది. 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు పాక్షిక ఏర్పాటులో భాగంగా 14 భాషాప్రయుక్త రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా 1956 నవంబర్ 1న సౌరాష్ట్ర, కచ్ రాష్ట్రాలతో సహా (ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఉనికిలో లేవు) ఇతర ప్రాంతాలను కలిపి బొంబాయి రాష్ట్రం పునర్వ్యవస్థీకరించబడింది. ఆ తరువాత “సంయుక్త మహారాష్ట్ర” ఉద్యమం తీవ్రరూపం దాల్చి పోలీసు కాల్పులలో 107 మంది అసువులు బాయడంతో అప్పటికే స్వతంత్ర రాష్ట్రంగా మనుగడలో ఉన్న బొంబాయి రాష్ట్రం, భాష ప్రాతిపదికన మరో మారు 1960 మే 1న రెండు (మహారాష్ట్ర మరియు గుజరాత్) రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించబడింది. 

పొంచి ఉన్న ప్రమాదం:

2005 జూలై 26 న ముంబై నగరంలో సంభవించిన జల ప్రళయం వందల మందిని బలిగొన్నది. ఇందుకు ప్రధానంగా నానాటికీ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మురుగునీటి వ్యవస్థ అందుబాటులో లేకపోవడం, సముద్రపు అధిక ఆటుపోట్లు వరదనీటిని తిప్పికొట్టడం, సహజ రక్షణగా మానవాళికి మేలు చేసే అడవులు లేకపోవడం, వగైరాలను కారణాలుగా పేర్కొనవచ్చు. నదీ తీరాన, పరీవాహక ప్రాంతాలలో చేపట్టే నిర్మాణాలు, నీరు మళ్లే సహజ మార్గాలను నిరోధించడంతో పాటు అవి కాంక్రీటు అరణ్యాలుగా మారి భూమి పొరల్లోకి నీరు ఇంకకుండా చేస్తుంది. “ఈ రోజు, ముంబైలో బంగారం కంటే ఖరీదైన వస్తువు రియల్ ఎస్టేట్” అని ఒక రియాల్టర్ పేర్కొనడం ఈ మహానగరం యొక్క ప్రమాదకర భవిష్యత్తుకు సంకేతంగా నిలుస్తుందని అనిపిస్తుంది.

 
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ