పదేళ్ల మోదీ అద్భుత పాలన ఇదే: కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy explained Modi's wonderful rule in the last ten years

Apr 1, 2024 - 15:55
 0
పదేళ్ల మోదీ అద్భుత పాలన ఇదే: కిషన్​ రెడ్డి
  • మోదీ పాలనలో ప్రగతి పథంలో భారత్​

  •  దేశం అన్ని రంగాల్లో అభవృద్ధి చెందింది

  •  కాంగ్రెస్​ గరీబీ హఠావో నినాదాలు ప్రజల బతుకులు మార్చలేదు

  •  మోదీ వచ్చాకే.. పేదల జీవితాల్లోకి వెలుగులొచ్చాయి

  •  మోదీ తొమ్మిదిన్నరేండ్ల పాలనపై మీడియాతో బీజేపీ స్టేట్​ చీఫ్ కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్​: మోదీ పాలనలో భారత్​ ప్రగతి పథంలో దూసుకువెళ్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ జి.కిషన్​ రెడ్డి తెలిపారు. 2014 వరకు పాలనాపరమైన వైఫల్యం కారణంగా.. ‘గరీబీ హఠావో’, ‘రోటీ-.. కపడా..-మకాన్’ వంటి రాజకీయ నినాదాలు ప్రజల్లో కొత్త ఆశ కలిగించినా.. వారి జీవితాల్లో కనీస మార్పు తీసుకురాలేదని ఆయన అన్నారు. మోదీ వచ్చాకే దేశంలో పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి మోదీ తొమ్మిదిన్నరేండ్ల పాలనపై బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 

గణనీయమైన ప్రగతి

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా భారతీయులు కనీస సామాజిక-ఆర్థిక అవసరాలకు దూరమయ్యారని, మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓ ప్రభావవంతమైన అడుగు ముందుకు పడిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘కోట్లమంది భారతీయుల జీవితాల్లో.. వారి భవిష్యత్తుకు సంబంధించి ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాలు ఇవ్వడం వంటి ఆలోచనల నుంచి బయటపడి.. దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా లాభాన్ని చేకూర్చే కార్యక్రమాలను రూపొందించి.. లీకేజీలు లేకుండా వాటిని అమలు చేయడం కారణంగా.. గత పదేళ్లలో భారతదేశం ఈ విషయంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఇతర దేశాలపై ఆధారపడే దశ నుంచి ఆత్మనిర్భరత ద్వారా ప్రపంచానికి సాయపడే దశకు చేరుకుంటోంది. పీఎం ఆవాస్ యోజన(పేదలందరికీ ఇళ్లు) -4 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరిగింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పేదలందరికీ ఉచిత రేషన్) - 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది. 2014 నుంచి పేదరికంలో నుంచి బయటపడిన వారి సంఖ్య 25 కోట్లు. పీఎం ఉజ్వల పథకంలో భాగంగా 10 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం. జల్ జీవన్ మిషన్ ద్వారా14 కోట్ల గ్రామీణ కుటుంబాలకు లబ్ధి జరిగింది. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా12  కోట్ల టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశాం. సెక్యులరిజంను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ.. కుల, మత, లింగ, జాతి భేదభావనలు లేకుండా.. 2014 నుంచి రూ.34 కోట్ల రూపాయలు.. వివిధ పథకాల లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేసింది మోదీ సర్కారు”అని తెలిపారు.

బీఆర్​ఎస్​ ఆవశ్యకత లేదు

బీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణలో అతి తక్కువ సమయంలో అంతం కాబోతున్నదని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు. దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. కేటీఆర్​ తాను సీఎం అవుతానని కలలుగన్నారు. ఇప్పుడు అదే ఊహాలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనపై మనమంతా జాలి చూపాలి. తండ్రీ కొడుకుల చేతిలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారు. ఎన్టీపీసీ శంకుస్థాపనకు వచ్చిన కేసీఆర్, పూర్తయ్యాక ప్రారంభానికి మోదీ వస్తే ఎందుకు రాలేదు”అని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. 

100 శాతం కరెంట్​

ఆయష్మాన్ భారత్ -పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా మోదీ ప్రభుత్వం ఉచిత వైద్యం అందించిందని, తద్వారా పేదలకు రూ.77 వేల కోట్లు ఆదా అయ్యాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘సౌభాగ్య యోజన ద్వారా 100 శాతం గ్రామీణ ప్రాంతాలకు కరెంట్ ఇచ్చాం. 2014కు ముందు పేదలకు బ్యాంకు అకౌంట్లు లేనందున.. డీబీటీ అమలు జరగలేదు. మోదీ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లలో రూ.73 వేల కోట్ల ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారుల అకౌంట్లలో వేసింది. 2014కు ముందు 55% గ్రామాలకే రోడ్లు ఉంటే.. పదేళ్లలో 99% గ్రామాలకు రోడ్ల నిర్మాణం పూర్తయింది. 2014లో దేశవ్యాప్తంగా 80 జనఔషధి కేంద్రాలుంటే.. ఇప్పుడు ఈ సంఖ్య 10 వేలకు పైనే దాటింది. 2014కు ముందు గ్రామాల్లో విద్యుత్ సరఫరా..12న్నర గంటలే ఉండేది. ఇప్పుడు 22న్నర గంటల కరెంట్ ఉంటోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ ను ఆచరణలో పాటించడం ద్వారా.. మారుమూల ప్రాంతంలో ఉన్న లద్ధి దారుడికి సైతం ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. సబ్సిడీలు.. ఎలాంటి లీకేజీలు లేకుండా నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. దీని కారణంగా గతంలో.. కేంద్రం రూపాయి పంపిస్తే.. చివరి వరకు చేరేది15 పైసలే అనే  పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.34 లక్షల కోట్లు అకౌంట్లలోకే వెళ్లాయి”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

అతిపెద్ద ఆర్థిక శక్తిగా..

దేశంలో దాదాపు3 లక్షల గిరిజన కుటుంబాలు.. ట్రైఫెడ్ ద్వారా అటవీ ఉత్పత్తులకు సంబంధించి రూ.44 కోట్ల విలువైన రిటైల్ సేల్స్ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.24 వేల కోట్లతో పీఎం జన్‌మాన్ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ‘‘భారతీయ సంప్రదాయ చేతి వృత్తుల వారికి, కళాకారులకు చేయూతనందించి.. అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకం తీసుకొచ్చాం. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు ద్వారా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. నెలకు 2.5 కోట్లకు పైగా మంది దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ పొందుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ్)లో భాగంగా మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నాం. తద్వారా పేదల సొంతింటి  కల సాకారం చేస్తాం. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి వచ్చే ఐదేళ్లు ఉచితంగా రేషన్ అందనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల  కల్పనను వేగవంతం చేయడం ద్వారా.. అక్కడ కూడా అభివృద్ధి జరుగుతోంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ కారణంగా.. చాలా సానుకూల మార్పులు సాధ్యమయ్యాయి. జన్ ధన్ ఆధార్ -మొబైల్ ద్వారా అందరికీ అకౌంట్లు.. ఆధార్, మొబైల్ నెంబర్ తో వాటి అనుసంధానత పెరగడం కారణంగా పారదర్శకత పెరిగింది. మోదీ సర్కారు నిర్ణయాల కారణంగా.. నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. 2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలైన.. ఎంఎస్​ఎంఈలకు ప్రోత్సాహం ద్వారా.. ఆర్థిక వ్యవస్థలోకి వీరందరినీ మళ్లీ భాగస్వాములను చేశాం. పన్ను సంస్కరణలతో జీఎస్టీ ద్వారా.. చాలా మార్పులు వచ్చాయి. నెలకు సగటున రూ.1.66 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా(వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్) మార్చేందుకు, ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా రూపుదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016 నుంచి 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల స్వనిధి రుణాలు అందాయి. రికార్డు స్థాయిలో.. 596 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.50 లక్షల కోట్లు) ఎఫ్​డీఐలు వచ్చాయి. ఎంఎస్​ఎంఈ రంగం 15 కోట్లకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోంది.2015 నుంచి దాదాపు 46 కోట్ల ముద్రా రుణాలు అందించాం. 14 కీలక రంగాలకు రూ. లక్షకోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించాం. ఒక్క 2022‑23లోనే.. 775 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.65 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. 51 కోట్ల జన్‌ధన్ అకౌంట్ల ద్వారా.. రూ.2 లక్షల కోట్లు సేవింగ్స్ అయ్యాయి. పారిశ్రమిక రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నాం”అని అన్నారు.

నారీ శక్తి - నారీ సమ్మాన్

2014లో 25 శాతం ఉన్న కార్పొరేట్ టాక్స్.. 2022లో 15 శాతానికి తగ్గించినట్లు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘2014కు ముందు 12.1% ఉన్న ద్రవ్యోల్బణం.. ఈ పదేళ్లలో 5.1 శాతానికి తీసుకొచ్చాం. 2014లో రూ.37 వేల కోట్ల లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఇవాళ రూ. లక్ష 20 వేల కోట్ల లాభాల్లో ఉన్నాయి. 2026 నాటికి మన జీడీపీలో డిజిటల్ ఎకానమీ విలువ 20% గా ఉండనుంది. దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటుగా భారతదేశం ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా, ప్రపంచ సప్లయ్ చైన్‌లో కీలకంగా మారబోతోంది. బేటీ బచావ్ ‑ బేటీ పఢావ్ ద్వారా బాలికల లింగ నిష్పత్తి 918 నుంచి 933కు పెరిగింది. 2016 వరకు ఐఐటీల్లో 8%గా ఉన్న యువతుల ఎన్‌రోల్‌మెంట్.. ఇప్పుడు 22%కు పెరిగింది. ఉన్నతవిద్యకు సంబంధించిన కోర్సుల్లో యువతుల ఎన్‌రోల్‌మెంట్ 43 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో మహిళల వర్క్‌ఫోర్స్ మరింత పెరగనుంది అనడానికి సంకేతం ఇది. 28 కోట్ల మంది మహిళలు మొదటిసారి బ్యాంకు అకౌంట్లు తెరిచారు. 31 కోట్ల ముద్ర రుణాలు మహిళలకే ఇచ్చాం. కోటిమంది లక్షాధికారి అక్కలు, చెల్లెమ్మలు.. గ్రామీణ భారతంలో మార్పు తీసుకొస్తున్నారు. 84 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.8 లక్షల కోట్ల రుణాలిచ్చాం. 97.4%  ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్లు నిర్మించాం. పీఎం ఆవాస్ పథకంలో లబ్ధిదారుల్లో 72%  మంది మహిళలే. 3.2 కోట్ల సుకన్య  సమృద్ధి యోజన అకౌంట్లలో.. రూ. 80 వేల కోట్లు జమ చేసుకున్నారు. ముస్లిం సోదరీమణుల తీవ్రమైన సమస్య ‘ట్రిపుల్ తలాక్’ను రద్దుచేశాం. ఒక్క రూపాయికే మహిళలకు ‘శానిటరీ ప్యాడ్స్’ అందిస్తున్నాం. ముఖ్యంగా.. అసెంబ్లీలు, పార్లమెంటులో 10% కన్నా తక్కువ ఉన్న మహిళల రిజర్వేషన్ ను 33%కు పెంచిన ఘనత మోదీదే. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించి విజయం సాధించిన.. ‘చంద్రయాన్-3’ సక్సెస్ లోనూ..100 మంది మహిళా శాస్త్రవేత్తలు వివిధ విభాగాల్లో కృషి చేశారు”అని కిషన్​ రెడ్డి తెలిపారు.

సాంస్కృతిక పునర్వైభవం

2014 నుంచి దేశంలో ఖాదీ వినియోగం 332 శాతం పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘దాదాపు రూ.లక్షా 35 వేల కోట్ల విలువైన ఖాదీ ఉత్పత్తులు వచ్చాయి. 
‘నమామి గంగా’లో భాగంగా గంగానది పరిశుభ్రత, నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య కారకాలను తగ్గించేందుక రూ.14 వేల కోట్లు ఖర్చు చేశాం. 13 కోట్ల మంది భక్తులు గత రెండేళ్లలో కాశీని సందర్శించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి కానుంది. చార్ ధామ్ యాత్ర కనెక్టివిటీ కోసం 900 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డుల పేర్లు పెట్టి గౌరవించుకున్నాం. గిరిజన పోరాట యోధులను స్మరించుకునేలా దేశవ్యాప్తంగా 10 మ్యూజియంలు సిద్ధమవుతున్నాయి. 2014 వరకు దేశంలో 30 యునెస్కో వారిసత్వ కట్టడాలుంటే.. పదేళ్లలో మరో 12 కట్టడాలకు గుర్తింపు  కలిపించాం. తెలుగు రాష్ట్రాలనుంచి మొదటిసారి రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది. భారతదేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన మన కళాఖండాలను వెనక్కు తీసుకువస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2014 వరకు 13 ఇలాంటి కళాఖండాలు స్వదేశానికి వస్తే.. గత పదేళ్లలో ఈ సంఖ్య 344కు చేర్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. 50 లక్షల మంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. అభివృద్ధితోపాటుగా.. మన సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడంపై  మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది”అని కిషన్​ రెడ్డి తెలిపారు.

అన్నదాతకు అండగా..

వ్యవసాయాన్ని ఆధునీకరించడం మొదలుకొని.. ఎరువుల రాయితీలు, భూసార పరీక్షలు, పంట బీమా మొదలైన వివిధ పథకాలతో రైతు సాధికారతకు మోదీ బాటలు వేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ‘‘2014తో పోలిస్తే.. వ్యవసాయ బడ్జెట్ 300% పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. 11 కోట్ల మంది రైతులకు రూ.2.6 లక్షల కోట్ల పీఎం కిసాన్ లబ్ధి జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో, మిల్లెట్ల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో భారత్ నిలిచింది.7 వేల అగ్రి స్టార్టప్స్ ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ కోసం రూ.19,300 కోట్లు కేటాయింపు. 2013–-14లో 12 మెట్రిక్ టన్నులుగా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్.. ఇవాళ 4,200 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఆహార  ఉత్పత్తుల ఎగుమతులు కూడా 4.9 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2014కు  ముందు దేశంలో కేవలం 3 మెగా ఫుడ్ పార్కులుంటే.. ఇవాళ 24 మెగా ఫుడ్ పార్కులున్నాయి. 1992 నుంచి 2014 వరకు దేశంలో11వేల సోలార్ పంపులుంటే.. ఇవాళ 5.3 లక్షల సోలార్ పంపులున్నాయి”అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

నిరుద్యోగం తగ్గింది

దేశ జనాభాలో సగం 25 ఏళ్ల లోపు వయసున్న వారేనని, యవశక్తిని ఎక్కుపెట్టి ప్రపంచానికి మన సత్తా చాటేందుకు మోదీ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘8 కోట్ల మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కు ముద్ర రుణాలు అందాయి. 10 వేల అటల్  టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా.. కోటిమందికి యువ ఇన్నొవేటర్స్ కు శిక్షణ. యూనివర్సిటీలు 723 నుంచి 1,113కు పెరిగాయి. డిజిటల్ ఎకానమీ ద్వారా 2014 నుంచి 2019 వరకు.. 6 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాం. డిజిటల్ లిటరసీ పెంచేందుకు 6 కోట్ల మందికి శిక్షణ ఇచ్చాం. నిరుద్యోగం 5.8% నుంచి 3.2%కు తగ్గింది. ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు అయ్యాయి. క్రీడల్లోనూ సత్తాచాటుతున్నాం. గతేడాది జరిగిన పారా ఏషియన్ గేమ్స్ లో గతంలో ఎన్నడూ లేనంతగా.. 111 మెడల్స్ సాధించాం. ఆత్మనిర్భర భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా 60 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10,740 కోట్ల లబ్ధి జరుగుతోంది”అని కిషన్​ రెడ్డి తెలిపారు.

అంతర్గత భద్రత

దేశ రక్షణలో మోదీ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘2025 ఆర్థిక సంవత్సరానికి రూ.6 లక్షల కోట్ల రక్షణ బడ్జెట్ పెట్టాం. ఇందులో 75% దేశీయంగా రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకే. 2014 నుంచి బార్డర్ రోడ్ బడ్జెట్(3,700 కోట్ల నుంచి 14,387 కోట్లకు) 400 శాతం పెరిగింది. ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ నుంచి 22,500 మంది క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు మోదీ. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. వామపక్ష తీవ్రవాదం 52 శాతానికి తగ్గింది. మూడోసారి మోదీ ప్రభుత్వం భారీ మెజారిటీతో (400+ సీట్లతో) అధికారంలోకి వచ్చిన  తర్వాత.. మరిన్ని అద్భుతమైన మార్పులు రానున్నాయి. ప్రజల సంక్షేమాన్ని, దేశ ప్రతిష్టను మరింతగా  పెంచేలా ఈ మార్పులు ఉండనున్నాయి. అందుకే.. ఈ మార్పులో మీరందరూ భాగస్వాములు కాగలరని.. బీజేపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను”అని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. 

ప్రపంచంలో భారత ఖ్యాతి..

అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూనే.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని పెంచడంలో మోదీ అద్భుతమైన కృషి చేశారని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన మొదటి దేశంగా.. ప్రపంచంలో రెండో అతిపెద్ద తయారీ కేంద్రంగా.. స్టీల్ ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా..101 దేశాలకు కరోనా టీకాలు సరఫరా చేసిన దేశంగా భారత్​ నిలిచింది. 2014లో 6 కోట్ల మొబైల్స్ మన దేశంలో తయారైతే.. దీన్ని 2022 నాటికి 31 కోట్లకు పెంచిన ఘనత మోదీ సర్కారుది. ఇలా ఎన్నో రికార్డులను ఈ పదేళ్లలో భారతదేశం నమోదు చేసింది. విదేశీ నిల్వలుకూడా రెట్టింపును దాటిపోయాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 686 కోట్ల నుంచి 16 వేల కోట్లకు పెరిగాయి. జీ20 సమావేశాలకు అధ్యక్షత ద్వారా.. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం”అని కిషన్​ రెడ్డి వివరించారు.