- అస్థిరత నుంచి సుస్థిరత దాకా ప్రజలకు వివరించాలి
- అన్నివర్గాల ప్రాధాన్యతకు ప్రధాని ప్రయత్నం
- కాంగ్రెస్, ఎన్సీ చర్యలను తిప్పికొట్టాలి
- బూత్ స్థాయిలో ప్రతీ ఒక్కరూ బీజేపీ ఒటేసేలా చర్యలు తీసుకోవాలి
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సుస్థిర, అభివృద్ధి భారత్ కు ప్రతీ ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ చార్జీ జి. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మకశ్మీర్ లోని రియాసీ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు, బీడీసీ సభ్యులు, సర్పంచ్ లు, శక్తి కేంద్ర ప్రముఖ్ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ను బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్ల ఎలా అభివృద్ధి బాటలో నడిపించారో ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు. రాళ్లు, ఉగ్ర దాడుల నుంచి విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, పర్యాటకం, కనెక్టివిటీ, సంక్షేమ పథకాలతో కూడిన వివరాలను అందించాలన్నారు. ఓటర్లకు రాష్ర్ట శాంతి, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను కళ్లకు కట్టిన విధంగా తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి ప్రధానమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు.
కాంగ్రెస్ రాహుల్ గాంధీ, దాని మిత్రపక్షాలు కలిసి దేశ విచ్ఛిన్నానికి చేసే ప్రయత్నాలను తిప్పికొట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నివసిస్తున్న దేశంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీలు చేస్తున్న ప్రయత్నాలను బూత్ స్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల దేశ వ్యతిరేక వైఖరులను తెలియజేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 25న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా, ప్రతీ ఒక్కరూ బీజేపీ అభివృద్ధి విజన్ కు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు శక్తి కేంద్ర ప్రముఖ్ ధన్ సింగ్ రావత్, ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.