ఎన్ సీసీ క్యాడెట్లు బాధ్యతాయుతంగా మెలగాలి
గ్రూప్ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం
నా తెలంగాణ: సంగారెడ్డి టౌన్: ఎన్ సీసీ క్యాడెట్లు క్రమశిక్షణ, దేశానికి బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని ఎన్ సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం అన్నారు. కల్నల్ సునీల్ అబ్రహం కందిలోని ఐఐటీ హైదరాబాద్ ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కల్నల్ ను 33వ తెలంగాణ బెటాలియన్ లెఫ్ట్ నెంట్ కల్నల్ రమేష్ సారియల్ స్వాగతం పలికారు.
కల్నల్ సునీల్ ఐఐటీ డైరెక్టర్ బీఎస్.మూర్తిని కలిసి ఎన్ సీసీకి సంబంధించిన సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా కల్నల్ సునీల్ కు ఎన్ సీసీ క్యాడెట్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ను ప్రదానం చేశారు. అనంతరం ఐఐటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్ సీసీ కార్యాలయాన్ని కల్నల్ ప్రారంభించారు. అనంతరం క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎన్ సీసీ క్యాడెట్ల ప్రవర్తన దేశానికి దిక్సూచిగా ఉండేలా ఉండాలన్నారు. ధర్మబద్ధంగా, విధేయతతో కూడిన ప్రవర్తన ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. అదే సమయంలో ప్రతీ ఒక్కరూ నీతి నిజాయితీతో కూడిన బాధ్యతాయుత భారతదేశ పౌరుడిలా మెసలు కోవాలన్నారు. సమాజ సేవలో ఎప్పుడు ఎన్ సీసీ క్యాడెట్లు ముందువరుసలో ఉండాలని కల్నల్ సునీల్ అబ్రహం క్యాడెట్లకు సూచించారు.