మోదీ బిజీ బిజీ షెడ్యూల్ హ్యాట్రిక్ కు ముందే పర్యటనలు ఖరారు!
ఎనిమిది దేశాల పర్యటనలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77 విదేశీ పర్యటనలు చేశారు. 2014 నుంచి 2019 మధ్య 49 విదేశీ పర్యటనలు చేయగా రెండోసారి గెలుపొందాక 2019 నుంచి 2024 వరకు 28 విదేశీ పర్యటనల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో ఏ దేశంలో పర్యటించలేదు.
అయితే ముచ్చటగా మూడోసారి మోదీ హ్యాట్రిక్ సాధించగానే మరిన్ని దేశాల్లో పర్యటనలకు ఇప్పుడే షెడ్యూల్ ఖరారు చేసుకుంటుండటం గమనార్హం.
నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఇటలీని సందర్శించనున్నారు. ఇటలీ ప్రధాని మెలోని కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం, షెడ్యూల్ విడుదల, అభ్యర్థుల ఎంపిక, విజయాపజయాలు లాంటి వాటితో ఆరు నెలలుగా ప్రధాని మోదీ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విదేశాంగ శాఖలతో ప్రధాని మోదీ భేటీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. జూన్ 4న ఫలితాల అనంతరం జూన్ 8న ప్రధాని అభ్యర్థి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలుస్తోంది. అనంతరమే మళ్లీ విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీ బిజీ కానున్నారు. 2024లోనే ప్రధాని మోదీ ఎనిమిది దేశాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల్లో యూఏఇ, ఖతార్, భూటాన్, ఇటలీ ఇంకా జీ–20కి హాజరైన ప్రముఖ దేశాలున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ స్విట్జర్లాండ్ లో జరగనున్న ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సదస్సుకు కూడా హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కజకిస్తాన్ లో జరిగే షాంఘై కోఆపరేషన్ సదస్సులో కూడా హాజరుకానున్నారు.
అక్టోబర్ లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్, రష్యాలో నిర్వహించనున్నారు.ప్రధానమంత్రి ఈ సదస్సుకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అటుపిమ్మట టోక్యో కూడా వెళ్లే అవకాశం ఉంది.
ఇదే సంవత్సరం చివరలో ఇథియోపియాలోని భారత్–ఆఫ్రికా సమ్మిట్ కూడా నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ సహాధ్యక్షుడుగా ఉండనున్నారు. ఈ సదస్సులో భారత్–ఆఫ్రికా దేశాల మధ్య దౌత్యబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితిలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఏది ఏమైనా గత పదేళ్ల నుంచే కాదు.. భవిష్యత్తులోనూ ప్రధానిగా మోదీ బిజీగా గడపనున్నారనేది సుస్పష్టమవుతోంది.