షాతో బోస్ భేటీ
రాష్ట్రపతి పాలన దిశగా ఊహాగానాలు? నివేదిక సమర్పణ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని తాజా పరిస్థితిపై ఆ రాష్ర్ట గవర్నర్ ఆనంద్ బోస్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు. శుక్రవారం ఉదయం కోల్ కతా మెడికో హత్యకు సంబంధించిన సమగ్ర వివరాలను షాకు నివేదిక రూపంలో సమర్పించారు. ప్రజాస్వామ్య బాధ్యతలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని షాకు తెలిపారు. విద్యార్థులపై కఠిన చర్యలకు పూనుకుంటున్న, కాల్పులకు పాల్పడుతున్న పోలీసుల చర్యను ఆక్షేపించారు. పోలీసు కమిషనర్ ను తొలగించాలని అమిత్ షాకు గవర్నర్ విన్నవించారు. కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. సత్వరమే బలమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతను గవర్నర్ షాకు వివరించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో రాష్ర్టపతి పాలనపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పెద్ద యెత్తున నిరసనలు, ఆందోళనలతో రాష్ర్టం అట్టుడుకుతోంది. ఈ ఉదంతాన్ని రాష్ర్టపతి కూడా తప్పుబట్టారు. గవర్నర్ గత వారం అధ్యక్షురాలితో కూడా కలిసి వివరాలను వెల్లడించారు.