మానవాళి మనుగడకు ముప్పు ఉగ్రవాదం
ప్రపంచదేశాలతో కలిసి ప్రధాని మోదీ చర్యలు శాంతి, అభివృద్ధి స్థాపనే లక్ష్యంగా ముందుకు భావితరాలకు సమస్యలు లేని భారత్‌ను అందిస్తాం చిన్న సమస్యలను సైతం జఠిలం చేసిన కాంగ్రెస్ ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్న ప్రధాని గ్లోబల్ లీడర్‌గా భారత్ గుర్తింపు సురక్షిత, శాంతికాముక ప్రపంచమే మోదీ లక్ష్యం సహారన్పూర్ ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సహారన్పూర్: శాంతి సమసమాజ స్థాపన కోసం ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించివేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రపంచదేశాలు కూడా ఉగ్రవాదమే పెద్ద సమస్య అని గుర్తించేలా చర్యలు తీసుకునేలా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకొని సత్ఫలితాలను సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మానవాళి మనుగడకు పెను విపత్తు కలిగిస్తుందని పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ సంకల్పించిందని యోగి స్పష్టం చేశారు.
శనివారం యూపీ సహారన్ పూర్ ఎన్నికల సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యోగి స్వాగతం పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ స్థాపించిన రోజు యూపీ నుంచి ప్రధాని ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు యోగి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గ్లోబల్ లీడర్ దేశంగా భారత్ ఎదుగుతోందని స్పష్టం చేశారు. కరోణా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశ ఆర్థిక స్థితిని పరుగులు పెట్టించిన ఘనత మోదీదే అన్నారు. ప్రధాని నేతృత్వంలోని వికసిత్ భారత సంకల్పం కోసం మనమంతా కలిసి పనిచేయాలని యోగి పిలుపునిచ్చారు. ఇందుకు మోదీ సహాయ సహకారాలుంటాయని స్పష్టం చేశారు.
సమస్యలు లేని నూతన వికసిత భారత్‌ను భావితరాలకు అందించేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవి, జఠిలంగా చేసిందన్నారు. కానీ మోదీ వచ్చాక ఆ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని తెలిపారు. అంతేగాక ప్రపంచదేశాలన్నింటితో శాంతి, అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. హింస అనేది ప్రపంచానికి పెనువిపత్తుగా మారిన ఈ తరుణంలో హింసను ప్రేరేపించే ఎలాంటి శక్తులను కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
నిరుపేదల అభివృద్ధి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని యోగి స్పష్టం చేశారు. పేదల అభివృద్ధి కోసం మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో సురక్షిత, అభివృద్ధి, శాంతి భారత్‌లోనే గాక ప్రపంచదేశాల్లో కూడా ఫరిడవిల్లాలనేదే ప్రధాని మోదీ సంకల్పమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
పాక్‌లోని ఉగ్రవాదులను ఏరివేసే చర్యలపై ప్రపంచంలోనే అతిపెద్ద పత్రిక ది గార్డియన్ ఆసక్తికర కథనాలు రాసిందన్నారు. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ అన్ని దేశాల సహాయ సహకారాలతో చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉగ్రవాదం ఏ దేశ సార్వభౌమత్వానికి మంచిది కాదని, ప్రజలను పీడించే, ప్రాణాలు తీసే సంస్కృతి మానవాళిలో మనుగడ సాగించలేదని అన్నారు. అందుకే అలాంటి చర్యలకు పాల్పడే వారు ఎక్కడ ఉన్నా వారి అంతమే మానవాళి మనుగడకు సురక్షితమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.