మేడిగడ్డ.. మేడిపండు 

Medigadda Medipandu politics has been going on for the last 130 days

Mar 4, 2024 - 13:43
 0
మేడిగడ్డ.. మేడిపండు 
  •  130 రోజులుగా రాజకీయ​ హైడ్రామాలు

  •  పొలిటికల్​ మైలేజ్​ కోసం కాంగ్రెస్​ ఆరాటం

  •  తప్పును కప్పిపుచ్చేందుకు బీఆర్​ఎస్​ ప్రయత్నం

  •  బ్యారేజీపై ఇరు పార్టీల నిందారోపణలు

  •  విచారణ పూర్తి కాలేదు.. బాధ్యులపై చర్యలు లేవు

  •  టూర్లతో హంగామా.. ప్రజెంటేషన్లతో హడావుడి

నా తెలంగాణ, హైదరాబాద్​: మేడిగడ్డ మేడిపండు రాజకీయం..130 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. పిల్లర్లు కుంగడం, పగుళ్లు కనిపించడంపై బ్యారేజీ నిర్మించిన బీఆర్​ఎస్, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్​ రెండు పార్టీలు నిందారోపణలతోనే కాలయాపన చేస్తున్నాయి. మేడిగడ్డను వాడుకొని పొలిటికల్​ మైలేజీ తెచ్చుకోవాలని, తద్వారా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు పొందాలని కాంగ్రెస్​ పార్టీ ఆరాటపడుతుండగా, మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాన్ని, నిర్వహణ, నిర్లక్ష్యాలను బయటకు రాకుండా కప్పి పుచ్చాలని బీఆర్​ఎస్​ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇలా నాలుగు నెలలుగా మేడిగడ్డ రాజకీయం నడుస్తూనే ఉన్నది. 

చర్యలు ఏవి?

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగాయి. పలు పిల్లర్లు నిట్ట నిలువునా పగుళ్లు ఇచ్చాయి. దీనిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం నిపుణులతో విచారణ జరిపించి, ఎక్కడ లోపం జరిగింది? అందుకు ఎవరు కారకులు అనే విషయాలు తేల్చి, ఎంత నష్టం జరిగింతో అంచనా వేసి, బాధ్యులపై కఠిన, క్రిమినల్​ చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఇవన్నీ పక్కన బెట్టిన కాంగ్రెస్​ ప్రభుత్వం బీఆర్​ఎస్​  అక్రమాలు, అవినీతిని కొంచెం కొంచెంగా బయటకు తీస్తూ.. దాన్ని పొలిటికల్​ మైలేజీ కోసం వాడుకోవాలని చూస్తున్నది. మేడిగడ్డ విషయంలో విజిలెన్స్​ ద్వారా విచారణ చేయిస్తామని, సిట్టింగ్​ జడ్జితో ఎంక్వైరీ వేయిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఏదీ తేల్చలేదు. కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి లేఖ రాస్తే.. మేడిగడ్డను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్యామ్​ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన రిపోర్టునే అటు అసెంబ్లీలో చదివి, ఇటు బయట కూడా ప్రస్తావించిన రాష్ట్ర సర్కారు.. సీబీఐతో ఎంక్వైరీ వేయించాలనే డిమాండ్​ ను మాత్రం లెక్క చేయడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపించాలనే చిత్తశుద్ధి ఉన్నదా? లేదా అనే అనుమానం కలుగుతోంది. బీఆర్​ఎస్​ నేతలను కాపాడేందుకే.. కాంగ్రెస్​ వారిపై చర్యలకు వెనకాడుతున్నదని బీజేపీ ఆరోపిస్తున్నది.



మేడిగడ్డ టూర్లు..

మేడిగడ్డకు కాంగ్రెస్​ ప్రభుత్వ పెద్దలు రెండు సార్లు టూర్​ వేశారు. రెండుసార్లు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్లు ఇచ్చారు. చివరికి ఏమీ తేల్చలేదు. బీఆర్​ఎస్​ పై ఆరోపణలు చేయడం, వాళ్లు అవినీతికి పాల్పడినట్లు విమర్శలు గుప్పించడం తిరిగి హైదరాబాద్​ కు రావడానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్​ నేతలు చెప్పినవన్నీ అబద్ధాలు అని, తాము అసలైన నిజాలు మేడిగడ్డ వద్దనే చెప్తామని బీఆర్​ఎస్​ నేతలు కూడా మేడిగడ్డ టూర్​ వేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు బస్సులో మేడిగడ్డను సందర్శించి.. కుంగినవి మూడే పిల్లర్లు, ప్రాజెక్టు అన్నాక.. ఇవి సహజం, రిపేర్లు చేసి, ఎత్తిపోతలు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇవ్వాలి అని ప్రెస్​ మీట్​ పెట్టి మాట్లాడారు. కాంగ్రెస్​ పై బీఆర్​ఎస్​ ఆరోపణలు.. బీఆర్​ఎస్​ పై కాంగ్రెస్​ విమర్శలు తప్పితే.. ఇరు పార్టీల టూర్లతో పైసా ప్రయోజనం కలుగలేదు.

కావాల్సినంత కంటెంట్​?

మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే.. నాలుగు నెలల నుంచి అటు బీఆర్​ఎస్​ కు, ఇటు కాంగ్రెస్​ కు కావాల్సినంత పొలిటికల్​ కంటెంట్​ సమకూర్చి పెట్టినట్లు అయింది. మెయిన్​ స్ట్రీమ్​ మీడియా కూడా బీఆర్​ఎస్​ నేతలు తిట్టినప్పుడు వాళ్లకు మైకులు పెట్టి.. కాంగ్రెస్​ పెద్దలు విమర్శించినప్పుడు వీళ్లకు మైకులు పెట్టారు తప్పితే.. కలం కదిలించి తప్పు ఎవరిదో చెప్పే ప్రయత్నం చేయలేదు. ‘‘మేడిపండు చూడు మేలిమై ఉండి.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు’’.. అన్నట్లుగానే ‘మేడిగడ్డ చూడు పిల్లర్లు కుంగి ఉండు.. టూర్​ వేసి చూడు మస్తు టైంపాస్​”అనే విధానం కొనసాగుతున్నది. ఈ రెండు పార్టీల తీరు పక్కన బెడితే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి, నివేదిక అందించనుంది. ఈ నివేదికతోనైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.