బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

Girl's murder.. Minister Sitakka visited the family

Jun 17, 2024 - 20:41
 0
బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
  • అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా
  • పుట్టెడు దు:ఖంలో బానోత్​ నరేష్​ కుటుంబం
  • నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం
  • పోలీసులు స్పందించి ఉంటే హత్య జరిగేది కాదా?
  • తప్పంతా నిందితులదే తప్పించుకోజూస్తున్న మంత్రి?
  • పోలీసులు, ప్రభుత్వం, రాజకీయ నేతల విశ్వసనీయతపై నీలినీడలు
  • వసంత కుటుంబానికి న్యాయం జరిగేనా?


నా తెలంగాణ, డోర్నకల్: ఇటీవలే కనిపించకుండా పోయి హత్యకు గురైన చిన్నారి వసంత కుటుంబ సభ్యులను సోమవారం మంత్రి సీతక్క పరామర్శించి ఓదార్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఎల్లంపేట రెవెన్యూ పరిధిలోని లక్ష్మతండాకు మంత్రి పలువురురితో లిసి వచ్చి కుటుంబాన్ని పరామరించారు. మంత్రితోపాటు డోర్నకల్ శాసన సభ్యుడు రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డిలు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. 

ఎంతటివారినైనా ఉపేక్షించం..

బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని తెలిపారు. హంతకుడు ఎవరన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులకు డ్రగ్స్​ మహమ్మారే కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.

బతుకుదెరువు కోసం వచ్చి.. బిడ్డ ప్రాణాలు పోగొట్టుకొని..

బతుకుదెరువు కోసమని హైదరాబాద్​ మియాపూర్​ లోని నడిగడ్డా తండాకు చెందిన బానోత్​ నరేష్​ కుటుంబం తరలివచ్చింది. అక్కడ ఉంటూ కూలీ నాలీ చేసుకొని బతుకీడుస్తున్నారు. ఈ నెల 7వ తేదీన నరేష్​ కూతురు వసంత (12) చాక్లెట్​ కోసమని దుకాణానికి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాలేదు. బాలిక కోసం నరేష్​ అన్నిచోట్ల వెతికి, వాకబు చేసినా లాభం లేకపోయింది. అదే రోజున మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. దీంతో 14వ తేదీన బాలిక మృతదేహం కాలిన స్థితిలో లభించింది. ఈ హృదయవిదారక ఘటనతో కుటుంబ సభ్యులతోపాటు స్థానికులను కంటతడి పెట్టించింది. రాష్​ర్ట వ్యాప్తంగా ఈ ఘటనపై దుమారం చెలరేగింది. అయితే బాలికపై హత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

పోలీసులేం చేసినట్లు..

7వ తేదీన ఫిర్యాదు చేస్తే పోలీసులు 14వ తేదీ వరకూ ఏం చేసినట్లు అనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిరుపేద కుటుంబమే కదా అనే ధోరణి వల్లే బాలికకు ఈ గతి పట్టిందా? అని శోకతప్త హృదయాలతో పరితపిస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు ఈ ఘటనలో నిందితుల పాత్ర ఎంతో ఉందో అంతే పోలీసుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో దక్కేదని అంతేగాక నిందితులు కూడా దొరికేవారనే విమర్శలున్నాయి. 

పొంతనలేని మంత్రి మాటలు..

కాగా సోమవారం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క ప్రకటన పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. నిందితులను పట్టుకుంటామని, ఉపేక్షించబోమనడంపై పలువురు మండిపడుతున్నారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా పోలీసుల తీరుపైనే తీవ్ర విమర్శలుండగా సాక్షాత్తూ మంత్రి స్థానంలో ఉన్న సీతక్క కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదన్నారు. ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని నిందితులకు ఆపాదిస్తూనే తప్పించుకోవాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. తూతూ మమగా కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటున్నామని చెప్పి చేతులు దులుపుకోవడమే తప్ప మంత్రి చేసిందేమీ లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా నిరుపేద బాలిక విషయంలో జరిగిన అన్యాయానికి ఎవరు బదులు చెబుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. నిందితులను ఇంతవరకూ పట్టుకోని పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం, రాజకీయ నాయకుల నమ్మకం, విశ్వాసాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.