Modi: కాంగ్రెస్​, బీఆర్​ఎస్ కుమ్మక్కయ్యాయి: మోదీ

Prime Minister Narendra Modi has accused Congress of colluding with BRS party in the Kaleshwaram project corruption issue.

Mar 4, 2024 - 15:59
Mar 4, 2024 - 16:04
 0
Modi: కాంగ్రెస్​, బీఆర్​ఎస్ కుమ్మక్కయ్యాయి: మోదీ
  •  బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
  •  బీఆర్​ఎస్​ పై విచారణకు వెనకాడుతున్నది
  •  గతంలో బీఆర్​ఎస్​ తిన్నది.. ఇప్పుడు మేం తింటామని కాంగ్రెస్​ అంటున్నది
  •  కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దు
  •  బీఆర్​ఎస్​ పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు
  • 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం
  •  ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా
  •  మోదీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ 
  •  ఆదిలాబాద్​ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

నా తెలంగాణ, ఆదిలాబాద్‌: భారతీయ జనతా పార్టీ వికసిత్‌ భారత్‌ కోసం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదిలాబాద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని.. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో మాట్లాడారు. ‘‘నా తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులు చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. గత15 రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులు మొదలు పెట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం”అని ప్రధాని పేర్కొన్నారు.

కాళేశ్వరం కుంగింది..

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిందని, ఈ విషయంలో బీఆర్​ఎస్​ పార్టీతో కాంగ్రెస్‌ కుమ్మక్కవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘‘ గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉంది. బీఆర్​ఎస్​ పోయి కాంగ్రెస్‌ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు. రాష్ట్రంలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాం. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. మోదీ గ్యారంటీ అంటే.. కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. అందులో ఒకటి తెలంగాణలో పెడతాం’’ అని మోదీ అన్నారు.



కుటుంబ పార్టీలను నమ్మొద్దు

ప్రజలు కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని ప్రధాని మోదీ సూచించారు. ‘‘కుటుంబ పార్టీల్లో రెండే అంశాలుంటాయి. ఒకటి దోచుకోవడం.. రెండు అబద్ధాలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోంది? ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా? వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి ఓటేయాలి. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగింది ఏమీ లేదు.. కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజలకు ఏమీ జరగదు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. వికసిత్‌ భారత్‌ కోసం బీజేపీ కృషి చేస్తుంది”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.



మరోసారి మోదీయే ప్రధాని: కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడారు. యావత్ ప్రపంచానికి నాయకుడిగా ప్రపంచ చిత్రపటంలో భారత్ ను అత్యున్నత స్థాయిలో నిలిపేలా నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారని అన్నారు. నీతివంతమైన, సమర్థవంతమైన, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నారు. మోదీజీ ప్రధానిగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా దేశ ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి విచ్చేశారు. గతంలో కూడా ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి17కు17 సీట్లు గెలిచేలా మద్దతు తెలపాలి. హైదరాబాద్ లో ఎంఐఎం సీటును సైతం బీజేపీ కైవసం చేసుకునేలా ఆశీర్వదించాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అహంకార, నియంతృత్వ పాలన చూశాం. అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ఇప్పుడు ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఓటుబ్యాంకు రాజకీయాలే తప్ప.. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ రకమైన ఎజెండా లేదు. రైతులకు రైతుబంధు పెంచుతామని హామీ ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అ హామీల్ని నెరవేర్చలేదు”అని కిషన్​ రెడ్డి అన్నారు.




మోదీతో కిషన్​ రెడ్డి ప్రత్యేక చర్చ

ఆదిలాబాద్​ బీజేపీ విజయ సంకల్ప సభ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా సభకు పెద్ద ఎత్తున జనం రావడం, ప్రజల నుంచి స్పందన బాగుండటంతో మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలకు కూడా  ప్రజల నుంచి విశేష ఆదరణ లభించినట్లు కిషన్​ రెడ్డి ప్రధాని మోదీకి చెప్పారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకునేలా పని చేయాలని కిషన్​ రెడ్డితో ప్రధాని అన్నట్లు తెలుస్తున్నది.