మా పదేళ్ల పాలన సంస్కరణల స్ఫూర్తి మహాత్మా పూలే

మాజీ సీఎం కేసీఆర్ ఫూలే 198వ జయంతి సందర్భంగా  స్పందించిన బీఆర్ఎస్ అధినేత బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఘనమైన నివాళి  గత ప్రభుత్వంలో పదేళ్లు వివిధ కార్యక్రమాలు చేపట్టినం

Apr 11, 2024 - 22:17
 0
మా పదేళ్ల పాలన సంస్కరణల స్ఫూర్తి మహాత్మా పూలే

నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ బహుజన కులాలు అన్ని రంగాల్లో సమానత్వం సాధించేలా కృషి చేయడమే మహాత్మా జ్యోతిరావు పూలేకి అర్పించే ఘనమైన నివాళి అని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం పూలే 198వ జయంతి సందర్భంగా ఫేస్‌బుక్ వేదికగా ఆయన స్పందించారు. ఆ మహనీయుడి త్యాగాలను, దేశానికి ఆయన అందించిన సమ సమాజ కార్యాచరణను కేసీఆర్ స్మరించుకున్నారు. సబ్బండ వర్గాల కోసం తమ ప్రభుత్వంలో 10 ఏళ్లపాటు వివిధ కార్యక్రమాలను అమలు చేశామని, తత్ఫలితంగా సామాజిక ప్రగతి కార్యాచరణ జరిగిందని గుర్తుచేసుకున్నారు. తమ పదేళ్ల పాలనాకాలంలో అమలైన పథకాలు, కార్యాచరణ, బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిందని, అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తి కార్యాచరణ మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఒకనాడు అల్ప దృష్టితో, నిర్లక్య ధోరణులతో,  వెనకబడిన సమాజంగా తెలంగాణను చూశారని, ఉద్యమ కాలం నుంచి రగిలిన సబ్బండ వర్గాల చైతన్యం నూతన రాష్ట్రంలో ప్రగతి పథంలో ముందడుగు వేసిందని కేసీఆర్ అన్నారు. ఈ మొత్తం క్రమంలో మహాత్మా పూలే స్ఫూర్తి ఇమిడి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.