ఇకపై యాదాద్రిలో అవన్నీ కుదరవు
ఆలయ భద్రత పై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రాంగణంలో సెల్ ఫోన్లు నిషేధం భక్తులతో పాటు ఆలయ సిబ్బందికీ నిబంధనల వర్తింపు
నా తెలంగాణ, యాదాద్రి : ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రికి లక్షల మంది తరలి వస్తున్న భక్తుల భద్రతకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మరోవైపు ప్రధానాలయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయంలో సెల్ ఫోన్లు నిషేధిస్తూ దేవస్థానం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రధానాలయంలోకి అర్చకులు, మినిస్టీరియల్ సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్ తో పాటు విలేకరులు కూడా ఫోన్లు తీసుకువెళ్తున్నారు. కేవలం భక్తులను మాత్రమే ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకు పోకుండా ఆపగలుగుతున్నారు. ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసుల వద్ద ఉన్న ఫోన్లతో ప్రధానాలయ ఫొటోలను తీస్తున్నారు. కొందరు భక్తులు కూడా ఫొటోలు దిగుతున్నారు. ఒక్కోసారి గర్భాలయాన్ని కూడా తమ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. ఈ కారణంగా కొన్ని భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయి. ప్రధాన ఆలయంలో పూర్తిగా సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కేవలం భక్తులకే ఈ రూల్ అమలవుతుండగా.. ప్రస్తుతం ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలోకి ఎవరూ ఫోన్లతో రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ భద్రతా సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే సిబ్బంది ఎవరైనా సరే తమ ఫోన్లను బయటే పెట్టాలని ఈవో స్పష్టం చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది, నాలుగవ తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు విలేకరులు కూడా ఫోన్లు బయట భద్రపరుచుకోవాలని ఆయన సూచించారు.