నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దుండగుల దుశ్చర్య
నవరాత్రి వేడుకల్లో అపచారం
విద్యుత్, సీసీ కెమెరాలు ధ్వంసం
దర్యాప్తు చేపట్టిన బేగంబజార్, అబిడ్స్ పోలీసులు
బజరంగ్ దల్ నాయకులు, కార్యకర్తల నిరసన
కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
నా తెలంగాణ, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దల్ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.ఆర్. లక్ష్మణ్ రావు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎస్ ఐ, సీఐ, అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని నిర్వాహకుల ద్వారా సమాచారం సేకరించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సొసైటీలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి కూడా యథాతథంగానే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న భక్తులు దాండియా ఆటలు ఆడి అనంతరం రాత్రికి ఇళ్లకు వెళ్లిపోయారు. వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు బజరంగ్ దల్ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.
దుండగులు తొలుత విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం విగ్రహం చేతిని, పూజా సామాగ్రిని ధ్వంసం చేశారు. రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ను సైతం తొలగించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఏసీపీ హిందూసంఘాలకు హామీ ఇచ్చారు. ఏది ఏమైనా నగరం నడిబొడ్డున పవిత్ర హిందూ పర్వదినాల్లో నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.