విశ్వాసాలను హస్తం దెబ్బతీసింది

పాఠశాలలు తగులబడేవి అమర్​ నాథ్​ యాత్రకు అనేక అడ్డంకులు అన్నింటినీ ఎదుర్కొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం ఉదంపూర్​ ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Apr 12, 2024 - 12:41
 0
విశ్వాసాలను హస్తం దెబ్బతీసింది

ఉదంపూర్​: అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించి కోట్లాది మంది హిందువుల మతవిశ్వాసాలను కాంగ్రెస్​ దెబ్బతీసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామాలయ నిర్మాణం ప్రభుత్వ నిధులతో జరగలేదని కోట్లాదిమంది హిందువులు కలిసి నిర్మించుకున్నారని తెలిపారు. కశ్మీర్​ లో గతంలో పాఠశాలలు తగలబడేవని, తమ ప్రభుత్వంలో విద్యాబోధన జరుగుతోందని మోదీ అన్నారు. కశ్మీర్​ లో డిజిటల్​ యుగాన్ని ప్రారంభించామని తెలిపారు. అమర్​ నాథ్​ యాత్రను సురక్షితం చేసుకొని మాతా వైష్ణోదేవి ఆశీస్సులను పొందగలిగామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ లాల్​ చౌక్​ లో భారత జెండా ఎగురవేశామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

రామ మందిరం ఎన్నికల అంశం కాదు..

జమ్మూకశ్మీర్​ లోని ఉదంపూర్​ ఎన్నికల సభలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్​ స్టార్టప్​ లకు ప్రసిద్ధి చెందుతుందన్నారు. ఇదే ఊపుతో ఇక్కడి ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరిస్తూ అభివృద్ధి దిశలో పయనించాలన్నారు. రామమందిరం ఎప్పుడు తమకు ఎన్నికల అంశం కాదన్నారు. అది తమ మత విశ్వాసాలతో ముడిపడి ఉందన్నారు. దాన్ని కాంగ్రెస్​ అనేక సంవత్సరాలుగా రాజకీయంగా వాడుకుంటూ ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ పబ్బం గడుపుకుందన్నారు. ఎంతోమంది యువతను తప్పుదారి పట్టించి పొట్టన పెట్టుకోవడానికి కారణమైందని మోదీ మండిపడ్డారు. ఎన్నికల తరువాత జమ్మూకశ్మీర్​ కు తిరిగి రాష్ర్ట హోదా కల్పిస్తామని తెలిపారు. ఆర్టికల్​ 370పై మీన మేషాలు లెక్కించారని, తమకు చేతగాక బీజేపీ ప్రభుత్వం చేస్తే మద్దతివ్వలేక చతికిలపడ్డారని తెలిపారు. అసలు వారికి జమ్మూకశ్మీర్​ అభివృద్ధిపై ఏమైనా ధ్యాస, ఆశ, లక్ష్యం ఉందా? అని కాంగ్రెస్​ పై మండిపడ్డారు. 

పర్యాటక రంగానికి ప్రోత్సాహంతో అభివృద్ధి సులువు..

రాష్ర్టంలో పర్యాటక రంగం విశేషంగా అభివృద్ధి చెందుతోందని దాని ఫలాలను ఇక్కడి ప్రజలు అనుభవించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఇందుకు సహాయ సహకారాలు అందించాలన్నారు. శాంతికాముక సమాజంలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

ప్రాంతాన్ని రావణ కాష్టం చేసిన కుట్రపూరిత రాజకీయాలు..

గతంలో ఇక్కడ పాఠశాలలు తగులబెట్టేవారని, రాళ్ల దాడులు, ఉగ్రదాడులు నిత్యకృత్యమన్నారు. కొందరు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు కుట్రలు, కుతంత్రాలతో ప్రజాజీవనాన్ని నరకప్రాయంగా మార్చారని మోదీ పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక అత్యంత సాహసోపేతమైన చర్యలను చేపట్టిందని గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతోనే ఈ ప్రాంత అభివృద్ధి ముడిపడి ఉందని ఇప్పటికైనా ఇక్కడి ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. రానున్న ఐదేళ్లలో ఉదంపూర్​ కు పర్యాటకంలో పెరుగుదల నమోదవనుందని తెలిపారు. ఐదేళ్లలో అభివృద్ధిలో రాష్ర్టం నూతన శిఖరాలకు చేరుకుంటుందని స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాలు, నిరుపేదలకు సంక్షేమ ఫలాలు..

ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రతీ నిరుపేదకు ఉచిత వైద్యం లభిస్తుందన్నారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనలో లోటులేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఉచిత రేషన్​ సౌకర్యం కల్పించామన్నారు. ప్రతీ గ్రామంలోనూ విద్యుత్​, రోడ్లు లాంటి సౌకర్యాలకు కల్పిస్తామన్నారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో కూడా నేడు డిజిటల్​ టెక్నాలజీ కనెక్టివిటీ కోసం మొబైల్​ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్​ పూర్తి డిజిటల్​ రాష్ర్టంగా మారాలన్నది, నూతన సాంకేతికతను వినియోగించుకొని ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తమ ముఖ్యోద్దేశ్యమని ప్రధాని మోదీ వివరించారు. 

భక్తిభావంతో సురక్షిత యాత్రలకు ఏర్పాట్లు..

అమ్మ వైష్ణోదేవి, అమర్​ నాథ్​ యాత్రను ఇప్పుడు సురక్షితం చేయగలిగామని స్పష్టం చేశారు. రాష్ర్టంలోని ప్రతిమూల ఒప్పుడు భక్తి స్వరాలు వినిపించడం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఇందుకోసం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా ఈ ప్రాంతాల నుంచి నిర్మూలించగలిగామని తెలిపారు. 

ఆర్టికల్​ 370 రద్దు భవిష్యత్తుకు భరోసా..

ఆర్టికల్ 370ని ఉపసంహరించుకోవడం వల్ల ఇక్కడి సోదరీమణులు, కూతుళ్లకు రేపటి భవిష్యత్​ పై భరోసా ఏర్పడిందన్నారు. తమ కుటుంబంలోని వారు ఇక సురక్షితంగా ఉంటారనే నమ్మకాన్ని మోదీ కల్పించారని తెలిపారు. రాజ్యాంగం హక్కుల ఫలితాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు యావత్​ జమ్మూకశ్మీర్​ రాష్ర్టం ప్రశాంతంగా నిద్దుర పోతోందన్నారు. మన సైనిక బలగాల సేవ, వారి బలిదానాలు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉండేలా తీర్చి దిద్దగలిగాయని స్పష్టం చేశారు. ప్రజల మనస్సుల్లో చెడు చేద్దామనే ఆలోచనలు లేవని వారిని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టి వారితో దురుద్దేశ్యపూర్వక రాజకీయ నేతలు అలా చేయించేవారని ఇప్పటికైనా గుర్తించడం సంతోషకరమన్నారు. రాష్ర్టంలో ఇప్పుడు ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్​ లను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధునిక సొరంగాలతో పర్వత ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా సులువుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తాను 1992లో ఏక్తాయాత్ర సందర్భంగా ఉదంపూర్​ కు వచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇక్కడ తనకు ఘన స్వాగతం, గౌరవాలు దక్కాయని తెలిపారు. అప్పుడు లాల్​ చౌక్​ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఇక్కడి ప్రజలకు మాట ఇచ్చానని స్పష్టం  చేసినట్లు తెలిపారు. 

హై అలర్ట్​.. ఎస్పీజీ భద్రత..

పీఎం రాక సందర్భంగా జమ్మూకశ్మీర్​ ఉదంపూర్​ లలో హై అలర్ట్​ 144 సెక్షన్​ ప్రకటించారు. ప్రధాని పర్యటన ప్రాంతాన్నంతటినీ ఎస్పీజీ దళాలు స్వాధీనం చేసుకొని పెద్ద యెత్తున భద్రతను ఏర్పాటు చేశాయి. అలాగే పలుచోట్ల ట్రాఫిక్​ ను దారి మళ్లించారు.