విచ్ఛిన్నం చేసే కుట్రలు భగ్నం చేద్దాం

ప్రధాని నరేంద్ర మోదీ

Nov 11, 2024 - 20:48
 0
విచ్ఛిన్నం చేసే కుట్రలు భగ్నం చేద్దాం
స్వామినారాయణ్​ 200 వార్షికోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
గాంధీనగర్​: కొంతమంది సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని, భారతీయులంతా కలిసి వారి కుట్రలను భగ్నం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం గుజరాత్​ లోని వడ్తాల్​ లో శ్రీ స్వామినారాయన్​ దేవస్థానం 200వ వార్షికోత్సవం సందర్భంగా వర్చువల్​ గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సమాజాన్ని కుల, మతాల ప్రాతిపదికన విభజించే వారిపై హెచ్చరిస్తూ.. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశానికి ఐక్యత అవసరమని అభివర్ణించారు. దేశాన్ని విభజించడానికి మన ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను మనమంతా తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 
 
ఉజ్జ్వల భవిష్యత్​ దూరంలో లేదు..
భారత ఉజ్జ్వల భవిష్యత్​ ఎంతో దూరంలో లేదన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని దేశ విచ్ఛిన్నకర శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని, కుల, మతం, భాష, రంగు ఆధారంగా విభజించే కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. విచ్ఛిన్న కుట్రలు, పురుషుడు, స్ర్తీ, గ్రామం, నగరం ఆధారంగా కొనసాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. భవిష్యత్​ లో విచ్ఛిన్నకర కుట్రలు తీవ్ర పరిణామాలకు దారితీసి భారత సంస్కృతి, సాంప్రదాయాలకు మంటగలిపే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అడ్డుకోవడం చాలా ముఖ్యమన్నారు. దేశానికి నిర్ణయాత్మక భవిష్యత్తును అందించే శక్తి సామర్థ్యాలు యువతలో ఉన్నాయని తెలిపారు. యువకులను సాధికారత, విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారత యువత మంచి, చెడు, నైపుణ్​యం, అభివృద్ధి లాంటి విషయాలకు పెద్ద శక్తిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.  స్వామినారాయణ్​ బోధనలు, శక్తి భారత చరిత్రలో ఎన్నటికీ ఆదర్శనీయమేనని మోదీ స్పష్టం చేశారు. 
 
రూ. 200 వెండి నాణెం విడుదల..
శ్రీ స్వామినారాయణ్​ దేవాలయం వడ్తాల్​ ధామ్​ స్థాపించి 200యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ దేశ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారత ప్రభుత్వం రూ. 200 వెండి నాణెం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేయడం సంతోషకరమన్నారు. మహాత్ములు, సాదువులు యువశక్తిని పునరుజ్జీవింప చేసి నూతన శక్తిగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. రాబోయే 25 యేళ్లు భారత యువ శక్తి మహానీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.