విజయ్​ దివస్​ అమరులకు ప్రధాని నివాళులు

26న కార్గిల్​ వార్​ మెమోరియల్​ ను సందర్శించనున్న మోదీ షింకున్​ లా టన్నెల్​ ప్రాజెక్టు ప్రారంభం

Jul 25, 2024 - 15:32
 0
విజయ్​ దివస్​ అమరులకు ప్రధాని నివాళులు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 25వ కార్గిల్​ విజయ్​ దివస్​ ను పురస్కరించుకొని శుక్రవారం (26)న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్గిల్​ వార్​ మెమోరియల్​ ను సందర్శించి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం షింకున్​ లా టన్నెల్​ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు పీఎం కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది.

షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ 4.1 కి.మీ పొడవు గల ట్విన్-ట్యూబ్ టన్నెల్‌. 15,800 అడుగుల ఎత్తులో నిము–పాడుమ్​–దర్భా రోడ్​ లో దీన్ని నిర్మించారు. దీంతో లేహ్​ కు కనెక్టివిటీ మెరగవనుంది. భద్రతా దళాలకు ఆయుధ సామాగ్రి, లడఖ్​ లో రవాణాను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. 

1999లో జరిగిన కార్గిల్​ యుద్ధంలో 527మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ యుద్ధంలో 1363 మంది పాల్గొన్నారు. శ్రీనగర్​–ద్రాస్​–కార్గిల్​ సెక్టార్​ లలో 15వేల అడుగుల ఎత్తున పాక్​ ఉగ్రమూకలు, సైనికులతో వీరోచితంగా పోరాడి కార్గిల్​ ను స్వాధీనం చేసుకున్నారు. వీరి త్యాగానికి గుర్తుగానే కార్గిల్​ వార్​ మెమోరియల్​ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అత్యంత శీతల ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ చలికాలంలో –35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకం, అమరజ్యోతి 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది.