- రేవంత్ మహా పర్యటనపై మంత్రి ఫైర్
- కాంగ్రెస్ వి రిక్తహస్తం హామీలే
- తెలంగాణ హామీలకే దిక్కూ దివానం లేదు
- మహారాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు
- 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలేది?
- తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ కు ఏటీఎంలు
- ఆర్ ఆర్ ట్యాక్సులతో మోసం
ముంబాయి: రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా, రేవంత్ రెడ్డిలు తెలంగాణకు ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలుకే దిక్కూ దివానం లేదని ఇక మహారాష్ట్రకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అన్ని పథకాల అమలు చేస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ముంబాయిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ గ్యారంటీలు, హామీలపై ధ్వజమెత్తారు.
గ్యారంటీల పేరుతో గారడీలు..
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను ఇచ్చిందన్నారు. తెలంగాణలో 99 శాతం అమలు కాలేదన్నారు. అన్ని అసత్య గ్యారంటీలు, హామీలే అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు మహారాష్ర్ట ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు గ్యారంటీల పేరుతో గారడీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలు దీన్ని గమనించాలన్నారు. వీరి గ్యారంటీల మోజులో చిక్కుకోవద్దన్నారు.
దోచుకున్న డబ్బు ఎన్నికల్లో ఖర్చు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యేడాది గడుస్తున్నా హామీల అమలు జరగలేదన్నారు. దీనిపై రాహుల్ గాంధీతో తాను, తెలంగాణ ప్రజానీకం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ కు ఏటీఎంలుగా మారాయని చెప్పారు. ఆర్, ఆర్ (రాహుల్, రేవంత్ రెడ్డి) ట్యాక్స్ ల పేరుతో పరిశ్రమలు, రియల్, ఉత్పత్తి సంస్థలు, భూ యజమానులను బెదిరించి వారి ద్వారా వసూలు చేసిన డబ్బును మహారాష్ర్ట ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
హామీలపై నిలదీత..
ఇంకా 40 శాతం మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. మహిళలకు రూ. 2500 ఎక్కడా అని నిలదీశారు. ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 15వేలు, కౌలు రైతుకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. యేడాదికి 12వేలు, ప్రతీ పంటపై కేంద్రం ఇచ్చే ఎంఎస్ పీధరకు అదనంగా రూ. 500 బోనస్ ఎక్కడా అని నిలదీశారు. ప్రస్తుతం రైతులు పండించిన ధాన్యాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కొనలేకపోతోందని మండిపడ్డారు. మిల్లర్లతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో హామీ ఇచ్చి ఒక్క ఇళ్లు కూడా కట్టకుండా సుందరీకరణ పేరుతో ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు.
రూ. 4 పెన్షన్ ఏదీ?..
యువ వికాస్ పేరుతో విద్యాభరోసా రూ. 5 లక్షల కార్డు ఎక్కడా అని ప్రశ్నించారు. రూ. 4 వేల పెన్షన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా ఏదని నిలదీశారు. రైతులకు పంటబీమా లేదన్నారు. యేడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు.
ఆర్థికంగా దివాలా..
ట్రాన్స్ కో, జెన్ కో మరో రెండు పవర్ జనరేషన్ సంస్థలకు రూ. 81,516 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. తెలంగాణలో అద్దెలు చెల్లించలేక రెసిడెన్షియల్ పాఠశాలలకు తాళాలు వేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ ఎస్ కేసీఆర్, ప్రస్తుతం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు తెలంగాణను దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
దయచేసి మహారాష్ట్ర ప్రజలు తాను చెప్పింది పూర్తిగా ఔపోసన పట్టించుకోవాలని, మోదీ నేతృత్వంలోని అభివృద్ధికి ఓటేయాలని, దేశాభివృద్ధికి అందరం కలిసి నడవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.