Modi: తెలంగాణను దోచుకున్న  వారిని విడిచిపెట్టం

Prime Minister Narendra Modi has warned that those who looted Telangana will not be spared

Mar 18, 2024 - 15:44
 0
Modi: తెలంగాణను దోచుకున్న  వారిని విడిచిపెట్టం
  •  బీఆర్​ఎస్​ కాళేశ్వరం ప్రాజెక్టు, ఢిల్లీ లిక్కర్​ పాలసీలో అవినీతికి పాల్పడింది: మోదీ

  •   గులాబీ పార్టీ తెలంగాణను దోచుకుంటే.. కాంగ్రెస్‌ ఏటీఎంగా మార్చుకుంది
  •  ఒక దోపిడీదారు మరో దోపిడీదారుతో పోరాడలేరు

  •  బీఆర్​ఎస్​ అవినీతిపై కాంగ్రెస్​ మౌనం వహిస్తోంది

  •  తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోంది

  •  ఈసారి రాష్ట్ర ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నారు

  •  జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ కామెంట్స్​

నా తెలంగాణ, జగిత్యాల: ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు పెరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది.. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ తగ్గుతున్నాయి. రానున్న ఎన్నికల్లో మా పార్టీకి దేశవ్యాప్తంగా 400కు పైగా సీట్లు రావడం ఖాయం. నేను భారతమాతను పూజించే వ్యక్తిని. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల. ఇక్కడి ప్రజలను బీఆర్​ఎస్​ దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని తన ఏటీఎంగా మార్చుకుంది. ఒక దోపిడీదారు.. మరో దోపిడీదారుపై పోరాడలేరని ప్రజలకు తెలుసు. బీఆర్​ఎస్​ దోపిడీపై కాంగ్రెస్‌ మౌనం వహిస్తోంది. తెలంగాణ డబ్బు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తోంది”అని విమర్శించారు.
కుటుంబ పార్టీల దోపిడీ..
కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ రెండూ మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, తెలంగాణను దోచుకున్న వారిని మేం విడిచిపెట్టేది లేదని మోదీ స్పష్టం చేశారు. ‘‘కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి. దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పేరు ఉంది. ఇప్పుడు అలాంటి పార్టీల జాబితాలో బీఆర్​ఎస్​ చేరింది. ఆ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో, ఢిల్లీ మద్యం వ్యవహారంలో అవినీతికి పాల్పడింది’’ అని మోదీ ఆరోపించారు.
రాహుల్​ వ్యాఖ్యలకు కౌంటర్​
‘శక్తి’పైనే తమ పోరాటం అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘శక్తి’ని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె దాని స్వరూపమే అని అన్నారు. ‘‘ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత విపక్ష కూటమి ముంబయిలో ర్యాలీ నిర్వహించి తమ మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో ‘శక్తి’కి వ్యతిరేకంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. కానీ, ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె దాని స్వరూపమే. అందుకే మనమంతా వారిని ఆరాధిస్తాం. ఆ శక్తినే నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. వారి సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. మన తల్లులు, కుమార్తెలను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమే’’ అని మోదీ వెల్లడించారు. మన దేశం చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతంగా దిగిన ప్రాంతానికీ ‘శివ శక్తి’ పేరు పెట్టినట్లు ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శక్తిని ఆరాధించే వారికి, దాన్ని నాశనం చేస్తామని చెప్పేవారి మధ్యే పోరాటం అని తెలిపారు. ఇందులో ఎవరు గెలుస్తారనేది జూన్‌ 4నే తెలుస్తుందని అన్నారు.