పేర్లు మార్చి నడుపుతున్న కోఠి కాలేజ్

Kothi College running the name change

Nov 30, 2024 - 22:28
 0
పేర్లు మార్చి నడుపుతున్న కోఠి కాలేజ్

అయోమయంలో విద్యార్థినులు
మా భవితవ్యం ఏంటని ప్రశ్​న
పేర్లు మార్చి నడుపుతున్న కళాశాల
గుర్తింపు లేని విద్య అన్యాయం ఆందోళన
కోఠిలో విద్యార్థినుల ధర్నా
ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

నా తెలంగాణ, హైదరాబాద్: కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల పరిస్థితి అయోమయంలో పడింది. చదువులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికేట్స్ ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని యూనివర్సిటీ విద్యార్థినులు ధర్నాకు దిగారు. హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ విద్యార్ధులు శనివారం కళాశాలలోనే బైఠాయించారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. "గుర్తింపు లేని విద్య అన్యాయం" అని "విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలి" అని ప్లకార్డులు ప్రదర్శించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మరుస్తూ నిర్ణయం తీసుకుంది. యూజీసీ నుండి మాత్రం విశ్వవిద్యాలయంగా గుర్తింపు మాత్రం సంపాదించలేదని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం దానిని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. యూజీసీలో చేర్చకపోవడం వల్ల, చదువులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికేట్స్ ఇస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని.. కోఠి మహిళ విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు.

రెండు ప్రభుత్వాలు విద్యార్థులను ఆగం చేశాయి

‘కోఠి మహిళా కళాశాల’ను బీఆర్ఎస్ ప్రభుత్వం ‘యూనివర్సిటీ’గా ప్రకటించింది. కానీ గత ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన రాకపోవడంతో అది అక్కడితోనే ఆగిపోయింది. ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’లో పెట్టే కోర్సులు, ఆర్థిక వనరులు, టీచింగ్, నాన్‌–టీచింగ్‌ పోస్టుల పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ, యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు అస్పష్టం గానే ఉండిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ఈ యూనివర్సిటీని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు ప్రకటించింది. కానీ అందుకు అనుగుణంగా ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు అందజేయలేదు. యూనివర్సిటీకి పేర్లు మార్చుతున్నారు తప్ప స్పష్టమైన డిక్లరేషన్ ఏది ఇవ్వడం లేదని విద్యార్థినుల ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ యూనివర్సిటీగా ప్రకటించి బిల్లు పాస్ చేయలేదు.. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. కానీ ఎటువంటి బిల్లు పాస్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.