నా తెలంగాణ, హైదరాబాద్:
లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల జోరు పెరిగింది. బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయాలన్న వ్యూహంతో సాగుతున్న సీఎం రేవంత్ బృందానికి ఢిల్లీ పోలీసుల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తాకింది. అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి బీజేపీపై జనాల్లో తప్పుడు ఆలోచన కల్పించాలన్న కాంగ్రెస్ కుట్ర బయటపడింది. ఢిల్లీ పోలీసుల నోటీసులందుకున్నా భయపడేది లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్ తీరు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు కల్పించింది. గెలిస్తే డిసెంబర్ 9 నుంచే అన్ని హామీలూ నెరవేరుస్తామంటూ రేవంత్ రెడ్డి ఊదరగొట్టారు. అప్పటికే పదేళ్లుగా అలవిగాని హామీలతో తెలంగాణను అప్పులపాలు జేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్లారు. దళితులకు మూడెకరాల భూమి, లక్ష రూపాయల ఋణమాఫీ లాంటివేవీ అమలు చేయలేక చేతులెత్తేశారు కేసీఆర్. రాష్ట్ర ఖజానా ఖాళీ అని తెలిసినా కాంగ్రెస్ పార్టీకి పోటీగా హామీలు గుప్పించారు. అప్పటికే బీజేపీ పట్ల రాష్ట్రమంతా సానుకూల దృక్పథంతో ఉండటం గమనించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా హామీలు గుప్పించి జనాన్ని గందరగోళానికి గురి చేశారు. ప్రజలను మాయ జేయడంలో పై చేయి సాధించిన రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ప్రధాన హామీలేవీ అమలు చేయలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం వెల్లదీస్తున్నది. ఇంతలో లోక్ సభ ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలుపోసినట్లైంది. 6 గ్యారంటీల మాటను మరిపించడానికి సవాళ్లు, ప్రతి సవాళ్లు, దేవుళ్ల మీద ఒట్లు, తప్పుడు ప్రచారాలను అస్త్రాలుగా వాడుకుంటున్నది.
మోదీ మేనియాతో దేశమంతా బీజేపీ ఫీవర్ నడుస్తుండగా తమ ఆటలు సాగవని అర్థం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను నమ్ముకున్నది. ముస్లిం రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా మెజారిటీ వర్గం ఆగ్రహంతో ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటకలో ముస్లింలను బీసీ కేటగిరీలోకి మార్చి వారికి బీసీ రిజర్వేషన్ కట్టబెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు బదలాయించడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ కర్నాటక ఘటనను తప్పు పట్టింది. ఇటీవల సిద్ధిపేటకు వచ్చి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమని వెల్లడించారు. ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్లను పూర్తిగా తొలిగిస్తామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందాల్సిన ఆ రిజర్వేషన్లను వారికే అందజేస్తామని స్పష్టం చేశారు. అమిత్ షా ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడుగా ప్రచారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్ షా చెప్పినట్లుగా మార్ఫింగ్ చేసిన వీడియోను సీఎం రేవంత్ సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వైరల్ చేయడం వివాదమైంది. మార్ఫింగ్ వీడియోను టీ కాంగ్రెస్ అధికార సైట్లో కూడా అప్ లోడ్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అదే నిజమని వైరల్ చేశారు.
అమిత్ షా పేరిట రూపొందిన మార్ఫింగ్ వీడియోను వాడుకుని దేశవ్యాప్తంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్ పార్టీ ఉబలాటపడింది. ఉచితాలు కాకుండా దేశాన్ని స్వయంసమృద్ధి సాధించే దిశగా తయారు చేస్తున్న బీజేపీని అప్రతిష్ఠపాలు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో దేశమంతా వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ కుట్ర బయటపడింది. అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దేశవ్యాప్తంగా పదిమందిని గుర్తించారు. మార్ఫింగ్ వీడియోను వైరల్ చేసి, బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండటం కలకలం రేపింది. తెలంగాణకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ నేతలకు సోమవారం ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 1 న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం వల్ల మతసామరస్యానికి విఘాతం కలిగే ప్రమాదముందని వెల్లడించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని పోలీసులు వివరించారు. ఈ కేసుకు సంబంధించి అసోంకు చెందిన ఒక కాంగ్రెస్ నేతను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అన్ని వర్గాల ప్రజలు తప్పు పడుతున్నారు.