నేటి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధితో పాటుగా రక్షణ రంగంలో కూడా వేగంగా పురోగతి సాధించడం భారత్ కు అత్యంత కీలకం. దానిలో భాగంగా 2024 నవంబర్ 27న స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి కె4ను అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విశాఖ తీరం బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించారు. మన దేశ క్షిపణి సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచిపోనున్నది.
జలాంతర్గామి నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బీఎం)ను పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ క్షిపణి రెండు దశల ఘన రాకెట్ మోటారు, ఘన రాకెట్ ప్రొపెల్లెంట్ ను ఉపయోగించి 2 టన్నుల పేలోడ్ ను మోసుకెళ్ళే సామర్థ్యంతో10 మీటర్ల పొడవు, 20 టన్నుల బరువు, 1.3 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. ఈ ప్రయోగంతో నేల, నింగి, సముద్రగర్భం నుంచి అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉన్న దేశాల సరసన మన దేశం చేరినట్లైంది. 3,500 కిలోమీటర్ల దాడి పరిధి కలిగిన కె4 క్షిపణి బలమైన అణు త్రయాన్ని( న్యూక్లియర్ ట్రయాడ్) అభివృద్ధి చేయడానికి భారతదేశ విస్తృత వ్యూహంలో భాగం.
ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విజయవంతంగా పరీక్షించిన ఈ ప్రయోగం అణు జలాంతర్గామి నౌకాదళాన్ని విస్తరించి ఆధునీకరించనున్నది. దానిని జలాంతర్గామి ప్లాట్ ఫారం నుంచి గత కొన్నేళ్లలో కనీసం ఐదుసార్లు పరీక్షించారు. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది. గత కొన్నేళ్లుగా మన దేశం వివిధ పరిధుల్లో క్షిపణులను పరీక్షిస్తున్నది. పది రోజుల కిందట ఒడిశా తీరంలో సుదూర హైపర్ సోనిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
కె4 క్షిపణి
కె4 అనేది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బీఎం). కె4 వంటి జలాంతర్గామి ప్రయోగ బాలిస్టిక్ క్షిపణులు ముఖ్యంగా వాటి అంతర్లీన మనుగడ కారణంగా విలువైనవి. భూ ఆధారిత క్షిపణి లేదా వాయు అణు వేదికల మాదిరిగా కాకుండా ఇవి ఎక్కువ కాలం సముద్రజలాల్లో మునిగి ఉండగలవు. శత్రు దేశాలు వీటిని గుర్తించడం, నాశనం చేయడం చాలా కష్టం. ఒకవేళ అణుదాడి జరిగిన కూడా తర్వాత వినాశకరమైన శక్తితో ప్రతీకారం తీర్చుకోగలవు. ఈ క్షిపణి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పది మీటర్ల పొడవు, ఒకటిన్నర మీటర్ల వ్యాసం, ఇరవై టన్నుల బరువు కలిగిన ఇది రెండున్నర టన్నుల వరకు వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. భూ ఆధారిత అగ్ని3 క్షిపణికి ఆధునిక రూపాంతరం ఇది. అణుశక్తితో నడిచే జలాంతర్గాములకు ఆయుధాలు అందించడానికి రూపొందించబడింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీద రూపొందించిన ఈ క్షిపణి 3,500కు పైగా స్ట్రైక్ రేంజ్ కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు. ఈ క్షిపణి స్టెల్త్ అండర్ వాటర్ ప్లాట్ ఫామ్ నుంచి ప్రయోగించే సమయంలో శత్రు భూభాగంలోకి లోతుగా దాడి చేస్తుంది. మునుపటి కె15 తో పోలిస్తే ఎక్కువ కార్యాచరణ సౌలభ్యాన్ని అందిస్తాయి. భారతదేశ సముద్ర ఆధారిత న్యూక్లియర్ ట్రయాడ్ ను అమలుచేసే మొదటి క్షిపణి ఇది.
న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ?
భూ ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ఐసీబీఎంలు), జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు (ఎస్ఎల్బీఎంలు), అణుబాంబుల క్షిపణులతో వ్యూహాత్మక బాంబర్లతో కూడిన త్రిముఖ సైనిక దళ నిర్మాణాన్ని న్యూక్లియర్ ట్రయాడ్ (అణ్వస్త్ర త్రయం) అంటారు. నాలుగు దేశాలైన అమెరికా, రష్యా, భారత్, చైనాలు మాత్రమే అణ్వస్త్ర త్రయం కలిగి ఉన్నాయి. అణుబాంబులు లేదా అణ్వాయుధ క్రూయిజ్ క్షిపణులను కలిగి ఉన్న విమానాలు, భూమి లేదా సముద్ర లక్ష్యాలపై ఉపయోగించే వాటిని బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లుఅని ద్రవ లేదా ఘన ఇంధన రాకెట్లతో నడిచే డెలివరీ వాహనాలు ప్రధానంగా బాలిస్టిక్ మార్గంలో ప్రయాణించే వాటిని భూ ఆధారిత క్షిపణులని, నౌకలు లేదా జలాంతర్గాముల నుంచి ప్రయోగించే అణు క్షిపణులను బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములని అంటారు. ఈ త్రయం ఒక దేశం భూమి లేదా సముద్రం నుంచి వాయుమార్గం ద్వారా అణు దాడి చేయడానికి వీలు కల్పిస్తుంది.
ఐఎన్ఎస్ అరిఘాత్
అరిహంత్ శ్రేణికి చెందిన రెండో దశ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్. ఈ ఏడాది ఆగస్టు 29న విశాఖపట్నంలో భారతీయ నౌకా దళంలో అధికారికంగా అరిఘాత్ చేరింది. ఉన్నతమైన రూపురేఖలు, తయారీ సంబంధి సాంకేతికత, విస్తృత పరిశోధన అభివృద్ధి, ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి క్లిష్టమైన ఇంజినీరింగ్ ప్రక్రియల ద్వారా అధిక ప్రావీణ్య పనితనంతో ఐఎన్ఎస్ అరిఘాత్ నిర్మాణం చేయబడింది. ఈ జలాంతర్గామిపై దేశీయంగా చేసిన సాంకేతిక పురోగతి దాని పూర్వీక అరిహంత్ తో పోలిస్తే గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఐఎన్ఎస్ అరిహంత్ 750 కిలోమీటర్ల పరిధి గల కె15 క్షిపణులను కలిగి ఉండగా ఐఎన్ఎస్ అరిఘాత్ 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మరింత అధునాతన కె 4 క్షిపణులను మోహరించగలదు.
భవిష్యత్తులో ఐఎన్ఎస్ అరిధమాన్
ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి విజయవంతంగా పరీక్షించిన ఈ ప్రయోగం అణు జలాంతర్గామి నౌకాదళాన్ని విస్తరించడానికి, ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగం. ఆగస్టు 2024 లో ప్రారంభించిన ఐఎన్ఎస్ అరిఘాత్ భారతదేశ ఆయుధాగారంలో రెండవ ఎస్ఎస్బిఎన్ పన్నెండు కె5 క్షిపణులు, నాలుగు కె4 క్షిపణులు, ముప్పై టార్పెడోలను మోసుకెళ్లగలదు. అణ్వాయుధ నిరోధక వైఖరిని పటిష్టం చేసుకునే భారత్ ప్రయత్నంలో ఇది కీలక ముందడుగు. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న ఐఎన్ఎస్ అరిధమాన్ భారత్ తన అణ్వస్త్ర నిరోధకతను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నది. ఇది 5,000 కిలోమీటర్లకు మించిన పరిధి కలిగిన క్షిపణులను మోసుకెళ్లగల ఎస్ఎస్బీఎన్ల ఫ్లీట్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసెల్ (ఏటీవీ) ప్రాజెక్టులో భాగం. ఈ జలాంతర్గాముల్లో కె5, కె6 వంటి శక్తివంతమైన క్షిపణులు ఉంటాయి. ఇవి 6,000 కిలోమీటర్ల వరకు దాడి పరిధిని కలిగి ఉంటాయి.
జనక మోహన రావు దుంగ
యం.యస్సీ ( ఫిజిక్స్ )
ఫోన్ 8247045230