రైతు ‘బంద్​’

Raithu Bnadu

Nov 30, 2024 - 22:26
 0
రైతు ‘బంద్​’
అధికారంలోకి రాగానే రైతుభరోసా ఇస్తామన్న కాంగ్రెస్​
ఆర్థిక భారంతో తప్పించుకునే వ్యూహం
రైతులు సబ్సిడీనే కోరుకుంటారన్న మంత్రి తుమ్మల
అన్నదాతలు కోరిందే ఇస్తామని మెలిక 
సన్నబియ్యానికే బోనస్ అని ఇదివరకే ప్రభుత్వ స్పష్టీకరణ
హాట్​ టాపిక్​ గా తుమ్మల వ్యాఖ్యలు
నా తెలంగాణ, హైదరాబాద్​ : రైతు బంధుకు కాంగ్రెస్​ ప్రభుత్వం మంగళం పాడబోతున్నది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలను మించి రైతు భరోసా పేరిట రూ.15 ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ, ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్​ సర్కార్​ దారులు వెతుకుతున్నది. వరి పండించే కొంతమంది రైతులకు ఇచ్చే బోనస్‌తోనే దాన్ని సరిపెట్టాలని చూస్తున్నది. తాజాగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం మహబూబ్​ నగర్​ లో నిర్వహిస్తున్న రైతుపండుగ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రైతుబంధు రద్దుపై జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూర్చుతున్నాయి. రైతులకు చెల్లిస్తున్న బోనస్ పై మాట్లాడిన మంత్రి.. రైతుల అనుభవాలు, అభిప్రాయాలు తాము తీసుకునే నిర్ణయాలకు దారి చూపుతాయన్నారు. ఈ క్రమంలో బోనస్‌ తీసుకున్న రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బోనస్‌ ద్వారా ఒక్క రైతుకు రూ.12,000 నుంచి రూ.15,000 వరకు లాభం పొందే అవకాశం ఉందన్నారు.
అన్నదాతలు కోరిందే ఇస్తామని మెలిక! 
కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న బోనస్‌ను రైతుబంధు కంటే మెరుగైన పథకంగా భావిస్తున్నారనీ,  రైతుబంధు కంటే బోనస్‌ ఇవ్వాలనే అభిప్రాయాన్ని చాలా మంది తెలిపారన్నారు. ఈ రెండింట్లో రైతన్నకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. దానిపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. బోనస్ ను సాకుగా చూపించి.. రైతు బంధును నిలిపేసే కుట్రకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదనీ దాని వెనక రైతుబంధు పై ప్రభుత్వం పెద్ద కుట్రే చేస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది. 2018-19 లో గత ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ఈ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట తన మెనిఫెస్టోలో ప్రధాన అజెండాగా పేర్కొన్న కాంగ్రెస్ ​అమలు విషయంలో వాయిదా వేసుకుంటూ వస్తున్నది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పథకం అమలు చేస్తామని రైతులను మభ్యపెడుతున్నది. అయితే తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలతో రైతు భరోసా (రైతుబంధు) పథకానికి మంగళం పాడే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతున్నది.  
కమిటీలతో కాలయాపన 
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018-19 వానాకాలం పంట సమయంలో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి పంటకు రూ.4000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8వేల చొప్పున చెల్లించింది. 2018-19 వానాకాలంలో 50.25లక్షల మంది రైతులకు 5236.29 కోట్లను అందజేసింది. ఆ తర్వాత పంటకు రూ.5వేలకు ప్రభుత్వం పెంచింది. అలా మొత్తంగా నిరుడు వానాకాలం వరకు రూ.72817.04 కోట్లను రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేసింది. గత యాసంగి సీజన్‌కు కూడా రైతుబంధును విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో రైతు బంధు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత అనుమతిచ్చినా వరుసగా బ్యాంకు సెలవులు రావడంతో ఆ నిధుల విడుదల సాధ్యం కాలేదు. అదే సమయంలో తాము  అధికారంలోకి వస్తే రైతుభరోసా పేరిట రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చినా అమలుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాలయాపన చేస్తూ.. రైతు భరోసాపై అధ్యయనం కోసం క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. తర్వాత ఆ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కొన్ని రోజులు హడావుడి చేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌ మొదలవుతున్నా.. ఇప్పటి వరకు రైతుభరోసాపై అతీగతి లేకుండా పోయింది. తాజాగా బోనసా.. రైతు బంధా.. రైతులు ఏదిచెబితే అదే ఇస్తామంటూ మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే రైతుబంధు అటకెక్కినట్టే అని స్పష్టమవుతున్నది. 
రైతు‘బంధు’కు కాంగ్రెస్​ కుట్ర : హరీశ్​ రావు
రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. రైతు బంధు కంటే రూ.500 బోనసే మేలని రైతులు చెబుతున్నారంటూ వ్యవసాయశాఖ మంత్రి చెప్పడం దారుణమని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.