కేసీఆర్, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరులు తప్పుడు ప్రచారంలో వారికి వారే సాటి: కిషన్​ రెడ్డి

అబద్ధాలు చెప్పడంలో మాజీ సీఎం కేసీఆర్​, ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి వారికి వారే సాటి అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి అన్నారు.

May 11, 2024 - 17:53
 0
కేసీఆర్, రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరులు తప్పుడు ప్రచారంలో వారికి వారే సాటి: కిషన్​ రెడ్డి
  • కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ
  • పచ్చకామెర్ల రోగిలా రేవంత్​ తీరు
  • నిజాలు చెప్పి గెల్వలేమని దుష్ప్రచారం చేస్తున్నరు
  • నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా దేశం కోసం బీజేపీ పనిచేస్తున్నది
  • ఈ పోరాటానికి ప్రజలు అండగా ఉండాలి
  • మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కామెంట్స్​

నా తెలంగాణ, హైదరాబాద్​:

అబద్ధాలు చెప్పడంలో మాజీ సీఎం కేసీఆర్​, ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి వారికి వారే సాటి అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి అన్నారు. పచ్చకామెర్ల రోగిలా రేవంత్​ వ్యవహారం కనిపిస్తున్నదని, నిజాలు చెప్పి గెల్వలేమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బీజేపీ స్టేట్​ ఆఫీసులో కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు.“కేసీఆర్​, రేవంత్ రెడ్డి ఇద్దరు తమకు తోచిన అబద్ధాలు చెబుతున్నారు. వారి ప్రకటనలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేశామంటూ ప్లెక్సీల రూపంలో అబద్ధాలు ప్రచారం చేసింది కాంగ్రెస్​. పోలింగ్​ దగ్గరపడుతున్న కొద్దీ రేవంత్ రెడ్డిలో అభద్రతాభావం, అసహనం, అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు వార్తలు పెరిగిపోతున్నాయి. బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంతో రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నరు. కేసీఆరే ప్రమాదకారి అనుకుంటే, కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారిగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. పుల్వామా దాడులకు సంబంధించి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ విషయంలో రేవంత్ రెడ్డి వాస్తవాలేంటని అడుగుతున్నాడు. భద్రతాదళాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదు. సైనికుల శక్తిపై విశ్వాసం లేకుండా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. పాక్​ కు అణిగిమణిగి ఉండటం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. పాక్​ దాడులను, ఎత్తుగడలను తిప్పికొట్టి పూర్తిగా నిలువరించి నడ్డివిరిచిన ఘనత బీజేపీ సర్కారుది. పాక్​ దగ్గర ఉన్న అణుబాంబులకు భారతదేశం భయపడదు. ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్ గాజులు పెట్టుకోలేదంటూ ప్రకటనలివ్వడం సిగ్గుచేటు”అని కిషన్​ రెడ్డి మండిపడ్డారు. 

గాడిద గుడ్డు ప్రచారం..

కేసీఆర్ కుటుంబం వైఖరి కారణంగా, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు లేని కారణంగా కేంద్రం అనేక రకాలుగా తెలంగాణకు సహకారం అందించినా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిపుచ్చుకోలేదంటూ గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు. కానీ అదే రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనను మర్చిపోయి గాడిదలతో గుడ్లు పెట్టించే స్థాయికి దిగజారిండని విమర్శించారు. ‘‘రేవంత్ రెడ్డి, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కేసీఆర్ మాదిరిగానే గోబెల్స్ ప్రచారానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నాడు బీఆర్​ఎస్​, నేడు కాంగ్రెస్​ ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లాంచాల్సిన కరువు భత్యం, బకాయిలను చెల్లించలేదు. కాంట్రాక్టర్లకు బకాయిలు, విద్యార్థులకు పీజు రీయింబర్స్​ మెంట్​, స్కాలర్షిప్స్​ చెల్లించడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిపై రెఫరెండమా లేక ఆర్ ఆర్ ట్యాక్స్ రెఫరెండమా అనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తేల్చిచెబుతారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక స్థానాల్లో మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను”అని కిషన్​ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగే పోలింగ్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తప్పకుండా బుద్ది చెప్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.