– బొగ్గు గనుల అమ్మకమంటూ సీపీఎం దుష్ర్పచారం
– వేలానికి, లీజుకు తేడా తెలియనట్టు సరికొత్త డ్రామా
– లీజుకు ఇస్తే అమ్మారంటూ తమ్మినేని తొండాట
– 51 శాతం రాష్ర్ట ప్రభుత్వ వాటా
– ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ కు సీపీఐ వత్తాసు
– రేవంత్ సర్కారుకు సమయం ఇవ్వాలన్న కూనంనేని
(నా తెలంగాణ, హైదరాబాద్)
అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కమ్యునిస్టులు ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. బొగ్గు గనుల వేలం పేరిట సింగరేణి గనులను అమ్ముతున్నారంటూ, ఉద్యోగాలు ఊడగొడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం అక్కసు వెల్లగక్కుతుండగా.. ఆరు గ్యారంటీల అమలుకు సమయం ఇవ్వాలంటూ సీపీఐ రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నది. సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బీజేపీని నిందించేందుకు వేలానికి, లీజుకు తేడా తెలియనట్టు బస్సుయాత్ర నాటకానికి తెరలేపారు. బొగ్గు గనుల లీజు వేలంతో సింగరేణి కుదేలవుతుందని గగ్గోలు పెడుతున్నారు.‘సింగరేణి పరిరక్షణ’ పేరిట సోమవారం బస్సు యాత్రను ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ, మోదీని లక్ష్యంగా చేసుకుని బస్సు యాత్రకు తెరలేపారు. బొగ్గు గనుల లీజు వేలం నిర్వహిస్తే.. గనులను అమ్ముతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వేలానికి, లీజుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కేంద్రం గనులను లీజు ఇచ్చేందుకు నిర్దిష్ట కాలానికి వేలం నిర్వహించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ, దాన్ని తమ్మినేని తప్పు పడుతున్నారు.
రాష్ట్రానికి 51 శాతం..
కేంద్రం సింగరేణిలో బొగ్గు తవ్వకాలకు లీజు ఇవ్వడానికి వేలం నిర్వహించినా.. స్థానిక రాష్ర్ట ప్రభుత్వానికి బొగ్గు గనులపై 51 శాతం వాటా ఉంటుంది. 51 శాతం ఉన్న వాటాదారుడిదే ఒప్పందంలో పై చేయి ఉంటుంది. లీజుదారుడు రాష్ర్ట ప్రభుత్వ కనుసన్నల్లోనే పనులు నిర్వహించాల్సి ఉంటుంది. సర్కారు పెట్టే నిబంధనలకు లోబడి గనులను తవ్వుకోవల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఒప్పందాన్నిరద్దు చేసుకునే వెసులుబాటు స్థానిక సర్కార్ కు ఉంది. ఇటువంటి తరుణంలో గనులను అమ్మేస్తున్నారంటూ తమ్మినేని చెప్తున్నారు. వాస్తవానికి వీరభద్రంకు కూడా ఈ విషయం తెలుసు. కార్మిక, కమ్యునిస్టు నేతగా అన్ని తెలిసినా.. కార్మికులను రెచ్చగొట్టే క్రమంలో వింత వాదనను తలకెత్తుకున్నారు. తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు కొత్త వింత వాదనను ఎంచుకున్నారు. సీపీఎం నాయకుల యాత్రను గమనించి కార్మిక నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని తెలిసిన నాయకులే ఏమీ తెలియనట్టు కార్మికులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆరు గ్యారంటీలపై కూనంనేని వత్తాసు
సీపీఎం బొగ్గు గనులపై విష ప్రచారం నిర్వహిస్తుండగా.. సీపీఐ మాత్రం కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నది. అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ కు అండగా నిలుస్తూ.. అయోమయానికి గురి చేస్తున్నారు. సోమవారం ఆరు గ్యారంటీలపై సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కాస్త సమయం ఇవ్వాలి. అన్న ప్రాసన నాడే ఆవకాయ తినమంటే ఎట్లా’ అంటూ వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా సీపీఐ, కాంగ్రెస్ కు మిత్ర పక్షం కావచ్చు. కానీ, వారు ఇచ్చిన హామీలను నిలదీయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, గద్దెనెక్కి ఎనిమిది నెలలవుతున్నా.. గ్యారంటీలను అమలు చేయలేదు. ఇదంతా తెలిసినా కూనంనేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలకడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికలో..
బొగ్గు గనుల లీజు వేలం, ఆరు గ్యారంటీలపై బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కమ్యునిస్టులకు మునుగోడు ఉప ఎన్నికపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మునుగోడు ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచింది. అప్పటి వరకు వారిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అమలు చేయకుండానే ఎలా మద్దతు ప్రకటించారని ఇరు కమ్యునిస్టు పార్టీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేళ్లు కేసీఆర్ ఎర్ర జెండా పార్టీ ముఖం కూడా చూడలేదు. ఆయన పిలవగానే వెళ్లి కేసీఆర్ పక్కన చేరారు. అదేమంటే బీజేపీ గెలుపును అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తామన్నది కమ్యునిష్టు పార్టీల సమాధానం. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీదరిస్తే ఇరు పార్టీలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ చెంత చేరారు. ఒకసారి బీఆర్ఎస్, మరోసారి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంపై వారి సిద్ధాంతాలనే ప్రజలు శంకిస్తున్నారు. ఎప్పుడు ఎటు వైపు మాట్లాడతారో తెలియదంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారు. వారి స్వప్రయోజనాలకు తమకు బలి చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో రాష్ర్ట అగ్ర నాయకత్వానికి టికెట్లు ఇప్పించుకుని తమను గాలికి వదిలేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.