కొత్త రేషన్ కార్డులేవి? పెన్షన్ల పెంపు ఏమైంది?

– రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ప్రశ్న – ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారు – ఉచిత బస్సు ఒక్కటే సర్వరోగ నివారణి అంటే ఎ ట్ల? – మళ్లీ కాంగ్రెస్​ కు జనం ఓటేసే పరిస్థితి లేదు – కేసీఆర్​ కుటుంబం వేల కోట్లు దోచుకున్నది – ఈ రెండు పార్టీలకు ఓటు వేయడం వృథా – మరోసారి మోదీని ప్రధానిగా గెలిపిద్దాం – సికింద్రాబాద్​ నుంచి నన్ను ఆశీర్వదించండి – ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జీప్​ యాత్ర

Apr 20, 2024 - 15:58
Apr 20, 2024 - 15:59
 0
కొత్త రేషన్ కార్డులేవి? పెన్షన్ల పెంపు ఏమైంది?

నా తెలంగాణ, హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డ్స్, పెన్షన్ల పెంపు ఏమైంది రేవంత్ రెడ్డి? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. హామీలన్నీ మరిచి మహిళలకు ఉచిత బస్సును సర్వరోగ నివారణగా కాంగ్రెస్ చెబుతున్నదని ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం కిషన్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీప్ యాత్ర జరిగింది. అడిక్ మెట్ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభమైన యాత్ర.. నాగమయ్య కుంట, వీహెస్ టీ, ఆర్టీసీ కల్యాణ మండపం, రాంనగర్ ఎక్స్ రోడ్ మీదుగా లలిత నగర్, జెమినీ కాలనీ, బాకారంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహిళలు, యువత కేంద్ర మంత్రి యాత్రకు ఘన స్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు.

బీఆర్ఎస్ పని అయిపోయింది

రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు కేసీఆర్ ను ఫాం హౌజ్ కే పరిమితమయ్యారు. “గత పదేండ్లలో తెలంగాణలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాలు దోచుకున్నారు. వేల కోట్లు సంపాదించారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్, గ్రానైట్ దోపిడీ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు.. ఇంకా అమలు చేయలేదు. హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేదు. రేషన్ కార్డ్స్, పెన్షన్ పెంపు ఏమైంది రేవంత్ రెడ్డి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజల మీద రాహుల్ గాంధీ టాక్స్ వేసి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓటు వేసిన వృథా”అని కిషన్ రెడ్డి.

దేశానికి మోదీ రక్ష

దేశానికి, ప్రజలకు ప్రధానిగా నరేంద్ర మోదీ రక్షగా ఉన్నారు కిషన్ రెడ్డి అన్నారు. ''దేశ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ప్రజలను కాపాడిన నాయకుడు మోదీ. మూడేండ్ల నుంచి పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు. దాన్ని మరో ఐదేండ్లు పొడిగించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నది. 500 ఏళ్ల తర్వాత రాముడి గుడి కట్టుకున్నాం. బీసీ సామాజిక వర్గం నుంచి మొదటిసారి మోదీ ప్రధాని అయ్యారు. మోదీ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. దేశం కోసం.. సమాజం కోసం పని చేస్తున్నారు. మరోసారి మోదీని ప్రధానిగా గెలిపించుకుందాం. సికింద్రాబాద్ నుంచి నన్ను ఎంపీగా ఆశీర్వదించండి” అని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.