కాషాయ కంచుకోట సికింద్రాబాద్
– భారీ మెజార్టీతో గెలుపు దిశగా కిషన్ రెడ్డి – కాంగ్రెస్ అభ్యర్థి దానంపై ప్రజల్లో వ్యతిరేకత – బీఆర్ఎస్ నుంచి పద్మారావు ప్రభావం చూపేనా! – ఇంకా ప్రచారం మొదలు పెట్టని కాంగ్రెస్, బీఆర్ఎస్ – నియోజకవర్గాన్ని చుట్టేసి.. నామినేషన్ కూడా వేసిన బీజేపీ అభ్యర్థి – కేంద్ర మంత్రిగా చేసిన అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత – జన్ లోక్ పోల్ సహా అన్ని సర్వేలు కిషన్ రెడ్డి వైపే
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు బరిలోకి దిగారు. ఈ ముగ్గురికి ఓటర్లలో మంచి బలం ఉన్నా.. ఎంపీగా, మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా కిషన్ రెడ్డికే గ్రౌండ్ అనుకూలంగా ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై భూకబ్జా ఆరోపణలు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ఉనికి చాటే స్థితిలో లేరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అభ్యర్థుల కంటే కిషన్ రెడ్డి ప్రచారంలో బాగా ముందు ఉన్నారు. ఇప్పటికే ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి బస్తీని, కాలనీని చుట్టేయడంతోపాటు నామినేషన్ కూడా దాఖలు చేశారు. దానం, పద్మారావు ఇప్పటి వరకు ఇంకా ప్రచారమే మొదలు పెట్టకపోవడం గమనార్హం.
నా తెలంగాణ, సికింద్రాబాద్ ప్రతినిధి: తెలంగాణలో ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం సికింద్రాబాద్. ఈ లోక్‌సభ నియోజకవర్గాన్ని1952లో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగింది. లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎక్కువ సార్లు ఇక్కడ హస్తం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 1957లో మొదటి సారి జరిగిన ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్11 సార్లు ఇక్కడ గెలిచింది. అలాగే బీజేపీ సైతం ఐదు సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ జోరుకు1991లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. ఇప్పటి వరకు అయిదుసార్లు బీజేపీకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. గతంలో బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. క్రియాశీలక రాజకీయాల నుంచి బండారు దత్తాత్రేయ తప్పుకున్నాక.. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర మంత్రి పదవి పొందారు. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్ బరిలోకి దిగగా.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలిపింది. వీరిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉండటం గమనార్హం.
రెండోసారి గెలుపు కిషన్ రెడ్డిదే!
రాజకీయాల్లో కిషన్ రెడ్డి అజాత శత్రువు. ఆయన ధ్యేయం ఒకటే. దేశంతో పాటు సికింద్రాబాద్ అభివృద్ధిని, పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన గత ఐదేండ్లు పనిచేశారు. 2047 లోగా భారత్ ను విశ్వగురుగా నిలిపే లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ను అందరికీ తెలియజేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు అందించి మూడోసారి ప్రధానిగా మళ్లీ ఎన్నికవుతున్న నరేంద్ర మోదీ విజయంలో తెలంగాణ ప్రజలను భాగస్వామ్యం చేయాలని.. ‘వికసిత భారత్’ సంకల్పాన్ని సాకారం చేయాలని కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే, గత పదేండ్లలో కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో, గత ఐదేండ్లుగా సికింద్రాబాద్ ఎంపీగా తాను ఏం చేశారో ఆయన ప్రజలకు నివేదిక రూపంలో చెప్పడం జనాలను విశేషంగా ఆకట్టుకున్నది. మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై కూడా ఆయన క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అందుకే కిషన్ రెడ్డికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలో అన్ని బస్తీలు, అపార్ట్ మెంట్, కాలనీ అసోసియేషన్లను కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా కలిశారు. ఇటీవల ఓపెన్ టాప్ జీప్‌లో ప్రచారం నిర్వహించారు. సొంత నియోజకవర్గంలో ప్రచారంతోపాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ.. కమలదళంలో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. సికింద్రాబాద్ లో జనం ఎవరివైపు ఉన్నారనే దానిపై జన్ లోక్ పోల్ లాంటి సర్వే సంస్థలు సహా వివిధ ఏజెన్సీలు చేసిన అధ్యయనంలో కిషన్ రెడ్డిదే గెలుపు అని తేలింది.
దానం ఎదురీత.. కాంగ్రెస్ కు కష్టకాలం..
బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయనను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆసిఫ్ నగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచిన దానం నాగేందర్ ఈసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే దానం కాంగ్రెస్ పార్టీలో చేరిక అటు సొంత పార్టీ నేతలతోపాటు, ప్రజలు కూడా ఆమోదించడం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను ఆయన ఉరికించి లాఠీలతో కొట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. అదీగాక ఆయన పూటకో పార్టీ మారతారు అనే మచ్చ పడిన నేత. భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు, సెటిల్ మెంట్లు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకాశ్ నగర్ ఎక్స్ టెన్షన్ కాలనీవాసులు ప్రజావాణిలో దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే దానం.. తన ఇంటి వెనుక ఉన్న 700 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. అటు రాజకీయంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ దానం ప్రొఫైల్ సరిగా లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ లో గెలుపు అవకాశాలను అమాంతం తగ్గించినట్లు చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ లో ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక సెగ్మెంట్ అయిన ఖైరతాబాద్ లో కాంగ్రెస్ లీడర్లపై దానం అణచివేత ధోరణి ప్రదర్శించారని, సొంత పార్టీ నాయకులే ఆయనకు మద్దతు ఇవ్వడం లేదు. అటు ప్రజల్లో మంచి పేరు లేక.. ఇటు పార్టీలో మద్దతు లేక దానం ఇంత వరకు క్షేత్రస్థాయిలో ప్రచారమే మొదలు పెట్టని పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్ అభ్యర్థి నామ్ కే వాస్తేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పొయిన బీఆర్ఎస్ ను రాష్ట్రంతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా నిరుత్సాహం ఆవరించింది. పార్టీ లోకల్ నాయకత్వం అటు అధికార కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీజేపీలో చేరింది. సికింద్రాబాద్ లో ఎవరిని బరిలోకి దింపాలనే చర్చ జరిపిన కేసీఆర్.. ఇతర అభ్యర్థులు ఎవరూ దొరక్క.. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపారు. ఏదో పోటీలో అయితే నిలబెట్టాము కానీ.. గెలుపు గురించి తాము మాట్లాడలేము అన్నట్లుగా గులాబీ నాయకుల తీరు కనిపిస్తున్నది. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పద్మారావు. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయనకు కొంత మంచి పేరే ఉన్నప్పటికీ.. ఎంపీగా బరిలోకి దిగడం పద్మారావుకు, బీఆర్ఎస్ నాయకులు నచ్చడం లేదు. అధిష్టానం ఆదేశించిందన్న ఏకైక కారణంతో ఆయన నామ్ కే వాస్తే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చర్చ నడుస్తున్నది. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించాల్సిన ఆవశ్యకత లేదని భావిస్తున్నారు. వచ్చే ఒకటి ఎంపీ సీటుతో ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు రాష్ట్రం కోసం ఏ మేరకు నిధులు తేగలరనే సందేహం సికింద్రాబాద్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీ నామమాత్రమే అని తెలుస్తున్నది.
సికింద్రాబాద్ కు మోదీ నిధులు
సికింద్రాబాద్ అభివృద్ధికి మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులతోపాటు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. సికింద్రాబాద్ సహా సిటీలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. చర్లపల్లి టెర్మినల్, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్, హైదరాబాద్ మెట్రోకు నిధులు, రిజీనల్ రింగ్ రోడు, రింగ్ రైలు ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.70.32 కోట్ల ఖర్చుతో 3,522 ఇండ్లను కేటాయించింది నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. రూ.75.57 కోట్ల నిధులు విడుదల కాగా.. ఇప్పటివరకు 3,522 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద నియోజకవర్గంలోని 22,351 మందికి రూ.58.56 కోట్ల రుణసదుపాయం కల్పించింది మోదీ ప్రభుత్వం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 6,216 స్వయం సహాయక సంఘాల ద్వారా నియోజకవర్గంలోని 948 మందికి బ్యాంక్ రుణాలతో జీవనోపాధి మెరుగు పరిచింది కేంద్ర ప్రభుత్వం.. అంతేకాదు మరో2,649 మందికి ఉపాధి శిక్షణ అందించింది.